చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్‌ను తిడుతున్నాడు… సీఎం కేసీఆర్..

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్‌ను తిడుతున్నాడు.. ఇది మ‌ర్యాదానా..? అని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌న‌గామలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు…రాజేశ్వ‌ర్ రెడ్డి రందీ ప‌డుతుండు. ఎవ‌డో జ‌న‌గాం వ‌చ్చి వ‌ర్లిపోయిండ‌ట. కుక్కులు మ‌స్తు మొరుగుతాయి. దాన్ని లెక్క పెడుతామా..? జ‌న‌గాంలో మొరిగిపోయిన కుక్క ఏం చేసిందో తెలుసా. రైఫిల్ ప‌ట్టుకుని ఎవ‌డ్రా తెలంగాణ ఉద్య‌మం చేసేద‌ని క‌రీంన‌గ‌ర్ మీద‌కు పోయిండు. ఆ రోజు నుంచి ప్ర‌జ‌లు రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టిండ్రు. వీళ్లు వ‌చ్చి మాట్లాడుతాం అంటే క‌నీసం సిగ్గుండాలి అని కేసీఆర్ మండిప‌డ్డారు…ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ ఉండి, ఆ రోజు చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి.. ఆనాడు పేగులు తెగేదాకా కొట్లాడిన రాజేశ్వ‌ర్ రెడ్డిని, తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను, వాళ్లంద‌రికి నాయ‌క‌త్వం వ‌హించి ఆమ‌ర‌ణ‌దీక్ష ప‌ట్టిన కేసీఆర్‌ను తిడుతుంటే ఇది మ‌ర్యాదానా..? ఇదే కాదు కేసీఆర్‌కు పిండం పెడుతా అంట‌డు. ఎవ‌రికి పిండం పెట్టాల్నో మీరు నిర్ణ‌యించాలి. ఇది మ‌ర్యాదానా..? ఇది రాజ‌కీయం అంటారా..? ఇట్ల స‌భ పెట్టుకుని నీ పార్టీ పాల‌సీ చెప్పుకో. గెలిచేటోడు చేస్త‌డా.. ఈ ప‌ని, డిపాజిట్లు పోయి ఓడిపోతామ‌ని భ‌య‌ప‌డేటోడే ఈ మొరుగుడు మొరుగుత‌రు అంతే క‌దా. తిట్టాలంటే ఈ దేశంలో తిట్లు క‌రువు ఉన్నాయా..? మ‌న‌కు తిట్ట‌రాదా..? ఇయ్యాల మొద‌లు పెడితే రేప‌టి దాకా తిట్టొచ్చు. మ‌నం ఆప ని చేస్త‌లేం. మ‌న విష‌యం చెప్పుకుంటున్నాం. ద‌య‌చేసి మీరంద‌రూ ఆలోచించి ఓటేయాల‌ని కేసీఆర్ పేర్కొన్నారు…
ఎన్నికల్లో ఆషామాషీగా, అలవోకగా.. చిన్నాయన చెప్పిండని.. బామ్మర్ది చెప్పిండని ఓటు వేయొద్దని.. సొంత విచక్షణతో ఓటుహక్కును వినియోగించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు.ఎన్నికల్లో పార్టీకొకరు నిలబడుతరు. ఎట్లయిన 30వ తారీఖున ఓట్లు పడుతయ్‌. 3 తారీఖున లెక్కబడుతరు. ఆడికి దుకాణం అయిపోతది. ఇది జనరల్‌గా మనకు తెలిసిన లెక్క. అసలు లెక్క అది కాదు. ఎన్నిక వస్తే ఏం జరగాలంటే.. నిలబడ్డ వ్యక్తి గుణం, గణం చూడాల్సిందే. ఎలాంటి వ్యక్తి ? ఏం చేస్తడో చూడాలి. ముఖ్యంగా అభ్యర్థుల వెనుక పార్టీల చరిత్రను చూడాలి. ఆ పార్టీల నడవడిక, దృక్పథాన్ని పరిశీలించాలి. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి గురించి వాళ్ల అవగాహన ఏంది. వాళ్లకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఎటు తీసుకుపోతరు? ఈ విషయంపై ప్రతి గ్రామంలో చర్చ జరిగితే అది నిజమైన ప్రజాస్వామ్యం. అప్పుడు తెలివితోని ఓటు వేసినట్లవుతుంది. తప్పకుండా తెలివికల్ల ప్రభుత్వం వస్తుంది.

రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు నేను చెప్పే నాలుగు మాటలను గ్రామాల్లో చర్చ పెట్టాలి. నిజానిజాలు తేల్చాలని కోరుతున్న. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకేఒక వజ్రాయుధం ఓటు. అది సామాన్యమైటువంటిది కాదు. ఆషామాషీగా అలవోకగా.. మా చిన్నాయన చెప్పిండు.. బామ్మర్ది చెప్పిండని ఓటు వేయాల్సింది కాదు. సొంత విచక్షణతో ఓటుహక్కును వినియోగించాలి. ఐదుసంవత్సరాలు రాష్ట్రం తలరాతను, తద్వారా మనందరి తలరాతను ఓటు మారుస్తుంది. చైతన్యం లేని ప్రజలను చైతన్యవంతం చేయాలి. చైతన్యం ఉన్న యువత వాస్తవాలపై చర్చ పెట్టాలి. అప్పుడు నిజమైన ప్రజాస్వామిక పరిణితి వచ్చే అవకాశం ఉంటుంది. మేలు జరిగే అవకాశం ఉంటుంది’ అన్నారు..