నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌….

*నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌*.

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌
11.30 గంటలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి
స్వామివారికి ప్రత్యేక పూజలు
విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళం
మొక్కు తీర్చుకోనున్న సీఎం కేసీఆర్‌ దంపతులు
పురోగతిలో ఉన్న పనుల పరిశీలనకు అవకాశం
ముఖ్యమంత్రి హోదాలో 21వ సారి స్వయంభూ నారసింహుడి పునర్దర్శనం పునఃప్రారంభమై 6 నెలల తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వామి చెంతకు రానున్నాడు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పించేందుకు సతీసమేతం గా శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకోనున్నారు. ఉదయం రోడ్డు మార్గం గుండా ప్రగతిభవన్‌ నుంచి బయల్దేరి యాదాద్రికి చేరుకోనున్నారు. నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ పనులను పరిశీలించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌తో పాటు మరికొందరు స్వర్ణతాపడానికి బంగారం విరాళంగా అందజేయనున్నట్లు ఈఓ ఎన్‌. గీత తెలిపారు.

*మహాద్భుతం మూలవర్యుల దర్శనం..*
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా మార్చి 28న యాదాద్రి స్వయంభూ ఆలయం సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా పునః ప్రారంభమై మహాద్భుతంగా మూలవర్యుల పునర్దర్శనం భక్తులకు కలుగుతుంది. ఆరు నెలలుగా పంచనారసింహుడిని భక్తులు ఆనందోత్సాహంతో దర్శించుకుంటున్నారు. కొండపైకి వచ్చేందుకు భక్తులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. బస్‌బే వద్ద దిగిన భక్తులు వెంటనే దర్శనానికి వెళ్లేందుకు సువిశాలమైన క్యూలైన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి అంతస్తులో టాయిలెట్స్‌, అడుగడుగునా దివీస్‌ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో ఆర్‌ఓఆర్‌ ప్లాంట్లను అందుబాటులో ఉంచారు. క్యూలైన్లలో నిలిచి భక్తులు జై నరసింహ.. గోవిందా అంటూ భక్తుల స్వామి వారిని దర్శించుకుని పులకించిపోతున్నారు. గతంలో కంటే నూతనాలయంలోని గర్భాలయ ముఖమండపంలో ప్రహ్లాద చరిత్ర, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా నిలువెత్తు ఆళ్వార్లు ఉండడంతోపాటు సువిశాలంగా తీర్చిదిద్దారని భక్తులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధన్యుడయ్యారని అభిప్రాయపడ్డారు.

*విదేశీ భక్తులు తాకిడి…* *హుండీకి విదేశీ కరెన్సీ…*
స్వయం భూ నారసింహుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు కేవలం 5 నుంచి 10వేల మంది, సెలవుదినాలతో పాటు శని, ఆదివారాల్లో 15 నుంచి 20 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చేవారు. అయితే ప్రధానాలయ పునఃప్రారంభం తర్వాత భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం రోజుకు 20 నుంచి 25 వేల మంది, సెలవు దినాలతో పాటు శని, ఆదివారాల్లో 50 నుంచి 60 వేల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం రోజు వారి ఆదాయం సుమారు 15 లక్షలకు పైగా రాగా, శని, ఆదివారాల్లో రూ. 25 నుంచి 30 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నది. దీంతో పాటు వివిధ దేశాల నుంచి భక్తులు స్వామివారి దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. స్వీడన్‌, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఆస్ట్రేలియా కరెన్సీ, అమెరికా, సౌదీ అరేబియా, కెనడా, సింగపూర్‌ దేశాల కరెన్సీ భారీగా స్వామివారి హుండీలోకి చేరుతున్నాయి గతంలో దేవాలయ చరిత్రలో ఎన్నాడూలేని విధంగా విదేశీ కరెన్సీ భారీగా స్వామివారి చెంతకు చేరుతుందని ఈఓ ఎన్‌. గీత తెలిపారు.

*ఒకవైపు దర్శనం.. మరోవైపు వసతుల కల్పన..*
యాదాద్రి ప్రధానాలయ పునః ప్రారంభానంతరం స్వామివారి సకల వసతుల కల్పనకు కావాల్సిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే కొండపైన బస్‌బే అందుబాటులోకి రాగా, సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌, స్వాగత ఆర్చ్‌ దాదాపుగా పూర్తికాగా తుది దశ పనులు సాగుతున్నాయి. ఎగ్జిట్‌ ఫ్లై ఓవర్‌ పూర్తికాగా భక్తుల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకొచ్చారు. ఎంట్రీ ఫ్లై ఓవర్‌కు లండన్‌ కేబుల్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుండగా పనులు సాగుతున్నాయి. కొండకింద ఉత్తర ప్రాంతంలో ఎగ్జిట్‌ ఫ్లైఓవర్‌ పక్కనే సత్యనారాయణ వ్రత మండపం 80 శాతం పనులు పూర్తయ్యాయి. కొండకింద ఆర్టీసీ బస్‌స్టేషన్‌ పనులు సాగుతున్నాయి. గండి చెరువు ఆధునీకరణ, గార్డెనింగ్‌ పనులు సాగుతున్నాయి. కార్తీక మాసానికి పనులు పూర్తి చేసుకుని స్వామివారి తెప్పోత్సవం నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

*21వసారి యాదాద్రికి…*
మొదటిసారిగా 2014 అక్టోబర్‌ 17న కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం పునర్నిర్మాణ పనుల పరిశీలన, కల్యాణోత్సవానికి, రాష్ట్రపతి రాకతో ఇలా పలుమార్లు వచ్చారు. చివరి సారిగా ఈ ఏడాది ఏప్రిల్‌ 25న రామలింగేశ్వరస్వామి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని నూతన ఆలయాన్ని పునఃప్రారంభించారు. 21వ సారిగా శుక్రవారం యాదాద్రికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని స్వర్ణతాపడానికి బంగారం సమర్పించనున్నారు.

*డీసీపీ నేతృత్వంలో బందోబస్తు..*
సీఎం కేసీఆర్‌ వస్తున్న నేపథ్యంలో డీసీపీ నారాయణరెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తును నిర్వహించనున్నారు. 1,000 మంది పోలీసులు పాల్గొననున్నారు. రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్న సీఎం కేసీఆర్‌ కొండకింద ఉత్తర భాగంలో గల ఎగ్జిట్‌ ఫ్లై ఓవర్‌ నుంచి కొండపైకి వెళ్తారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రయాణానికి ఆటంకం కలుగకుండా పోలీసు అధికారుల పటిష్ట చర్యలు చేపట్టారు. కొండపైన కేసీఆర్‌ దంపతులకు ఘన స్వాగతం పలికేందుకు ఆలయ అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

*బంగారం అందించనున్న కేసీఆర్‌ దంపతులు*

గతేడాది అక్టోబర్‌ 20న ఆలయ పనుల పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ విమానగోపురం బంగారు తాపడానికి విరాళాలు సేకరించాలని నిశ్చయించారు. ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెబుతూనే తమ కుటుంబం తరపున కిలో16 తులాల బంగారం సమకూర్చాలని నిర్ణయించగా శుక్రవారం స్వామివారికి అందజేయనున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. సీఎం కేసీఆర్‌ మరో ముగ్గురు వీఐపీలు స్వామివారికి బంగారు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం స్వామివారికి 4 కిలోల బంగారం స్వామివారికి సమకూరనుంది.

*సీఎం కేసీఆర్‌ టూర్‌ ఇలా…*

ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి యాదాద్రికి బయల్దేరనున్న సీఎం కేసీఆర్‌
ఉదయం 11.30 గంటలకు ప్రెసిడెన్సియల్‌ సూట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేయనున్నారు
మధ్యాహ్నం 3.00 గంటలకు సీఎం కేసీఆర్‌ యాదాద్రి నుంచి బయల్దేరి రోడ్డు మార్గం గుండా ప్రగతి భవన్‌ను తిరిగి ప్రయాణం కానున్నారు.