ఎమ్మెల్యే అభ్యర్థుల పై కెసిఆర్ సీరియస్..!?

పార్టీ నేతలపై అధినేత కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది అసమ్మతి నేతలను శాంతింపజేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ విఫలం అవుతుండటం, పార్టీ మారుతుండటంపై పలువురు ఎమ్మెల్యే క్యాండిడేట్లకు క్లాస్ తీసుకున్నారు.

నియోజకవర్గాల వార్ రూం నుంచి నిత్యం అభ్యర్థితో పాటు ఇన్‌చార్జులు, నేతలను అలర్ట్ చేస్తున్నా ఎందుకు కారు దిగుతున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న కొద్ది నేతలు పార్టీ మారుతుండటంపై అధిష్టానం ఆందోళన చెందుతోంది.

అసమ్మతి కార్యకర్త, సెకండ్ స్థాయి నేతల ఇంటికి వెళ్లైనా సరే పార్టీ మారకుండా చూడాలని అధిష్టానం నేతలకు మార్గనిర్దేశం చేసింది. ప్రతీ ఓటు కీలకమని.. ఆదిశగా ప్రతీ ఒక్కరిని కలువాలని సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించాలని ఆదేశించింది.

అయినప్పటికీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇన్‌చార్జుల వైఫల్యంతో పార్టీ మారుతున్నారని వార్ రూంలు అధినేత కేసీఆర్‌కు నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తరచూ నేతలు, కేడర్ పార్టీ మారుతున్న నియోజకవర్గాలపై స్పెషన్ ఫోకస్ పెట్టారు.

నల్లగొండ, మల్కాజి గిరి, ఎల్బీనగర్, నాగార్జునసాగర్, మునుగోడు, జహీరాబాద్ ఇలా పాతిక నియోజకవర్గాలకు పైగా నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మండలంలో, నియోజకవర్గంలో పార్టీలో కీలకంగా పనిచేస్తున్నవారు ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ జంప్ అవుతున్నారు.

రాష్ట్ర స్థాయి నేతలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్, ఎంపీటీసీలు సైతం మారుతుండటంతో ఆ నేతలపై పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఇతర పార్టీల్లోని నేతలపై ఫోకస్ పెట్టి మరీ కారెక్కిస్తూ బలహీనపడేలా చేస్తోంది.

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్‌కు సొంత పార్టీ నేతలు మరోవైపు షాక్ ఇస్తున్నారు. అసమ్మతితో పార్టీని వీడుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.