రేపు యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్..

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిర్వహించే స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కుటుంబసమేతంగా యాదాద్రికి చేరుకొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. అనంతరం కన్నుల పండుగగా నిర్వహించే తిరు కల్యాణ మహోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. యాదాద్రి ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కుటుంబ తరుపున బంగారం సమర్పిస్తామని గతంలో ప్రకటించిన విధంగా కిలో పదహారు తులాల బంగారాన్ని సీఎం ఆలయ అధికారులకు అందించనున్నారు. మధ్యాహ్నం ప్రెసిడెన్షియల్ సూట్ కి చేరుకొని ఈ నెల 28న ఆలయ ఉద్ఘాటన సందర్భంగా నిర్వహించ తలపెట్టిన మహాకుంభ సంప్రోక్షణ, గోపురాలపై కలశ స్థాపన, ఇతర పూజా కార్యక్రమాలు, భక్తులకు కల్పించే మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు..