కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు వచ్చేనా..! సీఎం రేవంత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారా..!

కేంద్రం నుంచి ఎక్కువ సాయం రావడం లేదు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.41,259 కోట్లు వస్తాయని కేసీఆర్ సర్కార్ బడ్జెట్‌లో అంచనా వేసుకుంది. 2023 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు కేవలం రూ.4,532 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయి. మొదటి ఎనిమిది నెలల్లో ఒక్కో నెలకు సగటున బడ్జెట్‌ అంచనాల్లో 1.4 శాతం మాత్రమే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి మొత్తంగా మరో ఐదారు శాతం గ్రాంట్లే వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాల్లో 18 నుంచి 20 శాతంలోపే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అందే అవకాశం ఉంది. అదే ఇతర రాష్ట్రాలకు మాత్రం విరివిగా అందిస్తున్నారు. గుజరాత్‌కు నవంబర్‌ వరకే అంచనాల్లో 102 శాతం గ్రాంట్లను విడుదల చేసింది. హర్యానాకు 59.57 శాతం, త్రిపురకు 45.12 శాతం, మధ్యప్రదేశ్‌కు 44.10 శాతం, ఉత్తరాఖండ్‌కు 39.23 శాతం, ఛత్తీస్‌గఢ్‌కు 33.46 శాతం గ్రాంట్లను ఇచ్చారు. గ్రాంట్ల విడుదలకు కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ.. అవన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఏదో ఓ కొర్రీలు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న విమర్శలు తెలంగాణ వైపు నుంచి వస్తున్నాయి. ఇటీవల ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఆర్థిక కష్టాలను వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని ఇప్పించాలని కోరారు. మరి ఎంత మేరకు రేవంత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారో చూడాల్సి ఉంది.