పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా?..బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్న…

బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్న…

పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు..

గుజరాత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ తీసుకెళ్లి, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్‌ ఎందుకు తేలేదు?..

పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా? అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ అభ్యర్థులకు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లేయాలని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు చక్కటి అవకాశం వచ్చిందని, ఇక్కడి నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్‌ అభ్య ర్థులను లోక్‌సభకు పంపిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగు తుందని చెప్పారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.

పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు…’గత పదేళ్లలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బుల్లెట్‌ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్‌ ఎందుకు తేలేదు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోదీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి నిధులెందుకు ఇవ్వలేదు? రీజినల్‌ రింగు రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు..’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.