కేసీఆర్ ముందుగానే 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ వాహనాలు కొనుగోలు చేసి విజయవాడలో పెట్టారు.. సీఎం రేవంత్ రెడ్డి..

కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని విజయవాడలో దాచారు : సీఎం రేవంత్

Ex CM KCR Land Cruiser Cars : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనవసరపు ఖర్చులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 22 ల్యాండ్ క్రూయిజర్‌ కార్లను కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు. ఈ విషయం తాను అధికారం చేపట్టిన కొన్ని రోజుల తర్వాత అధికారుల ద్వారా తెలిసిందని చెప్పారు. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి గురువారం ప్రారంభించబోయే ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను విడుదల చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తాను మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకంతో కేసీఆర్ ముందుగానే 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఒక్కో ల్యాండ్ క్రూయిజర్ కారు ధర రూ. 3కోట్లు ఉంటుందని, వాటికి బుల్లెట్‌ ప్రూఫ్‌ సౌకర్యం అమర్చాలంటే ఖర్చులు అదనమని చెప్పారు. మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారగణంతో దర్పం ప్రదర్శించడానికి ప్రజాధనాన్ని వృథా చేశారని రేవంత్ రెడ్డి కేసీఆర్పై ధ్వజమెత్తారు