మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్..

విద్యుత్ శాఖ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలు సహించబోమని ఫైర్ అయ్యారు. కొంతమంది విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలన్నారు…గతంలో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగిందని, అవసరాలకు సరిపడ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో సర్కార్ కు చెడ్డ పేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే తమకు ఉందని సీఎం రేవంత్ హెచ్చరించారు.

విద్యుత్ శాఖలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. నిన్న హన్మకొండలో మంత్రి సీతక్క పాల్గొన్న కార్యక్రమంలో మధ్యలో విద్యుత్ అంతరాయం కలిగింది. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇలాగే మరో రెండు మూడు చోట్ల కూడా కరెంటు కోతలు కనిపించాయి. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కొంతమంది అధికారులు పనిగట్టుకుని ఈ పని చేశారని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ అంతరాయం వెనుక కుట్ర కోణం ఉందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. ఆ మూడు చోట్ల ఎందుకు విద్యుత్ అంతరాయం జరిగింది అని ప్రశ్నించారు.

సరిపడ విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు కోతలు ఎందుకు విధిస్తున్నారు? అని నిలదీశారు. ఎక్కడా కూడా ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించలేదు. మరి ఎందుకిలా అంతరాయం కలుగుతోంది? అని అధికారులను ఆరా తీశారు సీఎం రేవంత్. సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చు తగ్గులను సరి చేయాల్సిన డీఈల పర్యవేక్షణలో కొంత లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని సీఎండీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో నియమితులైన అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పనులు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగిదే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్..