కంప్యూటర్స్‌ చదవకున్నా ఐటీజాబ్స్‌ …

బ్యాచిలర్‌ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్స్‌ చదివితేనే ఐటీ కొలువులు వస్తాయన్న అభిప్రాయం చాలామందిలో ఉన్నది.

కానీ ఇది నిజం కాదంటున్నారు ఐటీ రంగ నిపుణులు.

ఇందుకు మెక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెండ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ను ఉదాహరణగా చూపుతున్నారు.

సత్య నాదెండ్ల బ్యాచిలర్‌ డిగ్రీలో ఎలక్ట్రికిల్‌ ఇంజినీరింగ్‌, సుందర్‌ పిచాయ్‌ మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇలా ఎంతోమంది బ్యాచిలర్‌ డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ కాకుండా ఎలక్ట్రికిల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ తదితర బ్రాంచీల్లో చదివినప్పటికీ ఐటీలో కొలువులు చేస్తున్నారని చెప్తున్నారు.

ఐటీ కంపెనీల్లో ఉద్యోగానికి టెక్నాలజీ మీద పట్టు ఉండటమే ప్రధానమని, డిగ్రీలు కాదని స్పష్టంచేస్తున్నారు. ఐటీ ఉద్యోగంలో చేరేందుకు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయితే చాలు అని కంపెనీలు కూడా పేర్కొంటున్నాయి. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసినవారు సైతం ఎందరో ఉన్నారని చెప్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌కే క్రేజీ నెలకొన్నది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ లాంటి కోర్సుల్లో ….ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ పూర్తయిన తర్వాత మిగిలిపోయిన ఇంజినీరింగ్‌ సీట్లే ఇందుకు తాజా ఉదాహరణ..

ఎక్కువ ఉద్యోగావకాశాలు ఐటీలోనే..

ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌లో 80% మంది ఐటీ రంగం అంటేనే ఆసక్తి చూపుతున్నారు. ఐటీలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటం, అత్యధిక వేతనాలు లభిస్తుండటం, వారానికి 5 రోజుల పనిదినాలు ఇందుకు కారణం. వీటికితోడు దేశ, విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు అత్యంత అనుకూలమైన ఉద్యోగం ఐటీ. దీంతో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌కే విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కారణాలతోనే ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సివిల్‌, కెమికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఐటీ కంపెనీలు ఉద్యోగుల నియామకంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఏదైనా.. కోడింగ్‌ నైపుణ్యం, ట్రెండింగ్‌లో ఉన్న టెక్నాలజీల్లో పట్టు ఉన్నదా? లేదా? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకొంటారు. -సందీప్‌కుమార్‌ మక్తల, ఐటీ నిపుణులు