బంగ్లా, నేపాల్‌, మయన్మార్‌తో పాటు షీసెల్స్‌ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్న ఇండియా

పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను గురువారం ఉదయం నేపాల్‌ రాజధాని ఖాట్మాండు, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు తరలించారు. నేపాల్‌కు 10లక్షలు, బంగ్లాకు 20లక్షల డోసులను ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో పంపారు. ఈ వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం ఆయా దేశాలకు ఉచితంగా అందజేస్తోంది. నేపాల్‌ సర్కారు 72శాతం పౌరులకు టీకాలు వేయాలని యోచిస్తోంది. త్వరలోనే టీకా డ్రైవ్‌ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్‌ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు నేపాల్‌కు వైద్య పరికరాలు, మందులు అందజేసింది. ఈ నెల 8న బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సైతం భారత్‌ నుంచి 30 మిలియన్‌ డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్‌’ను కొనుగోలు చేసేందుకు ఆమోదిందించింది. ఇప్పటికే భూటాన్‌, మాల్దీవులు, బంగ్లా, నేపాల్‌, మయన్మార్‌తో పాటు షీసెల్స్‌ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రకటించింది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో భారతదేశం హైడ్రాక్సీక్లోరోక్విన్, రెమ్‌డెసివిర్, పారాసెటమాల్ మాత్రలు, అలాగే డయాగ్నొస్టిక్ కిట్లు, వెంటిలేటర్లు, మాస్క్‌లు, గ్లౌజులు, ఇతర వైద్య సామగ్రి పెద్ద సంఖ్యలో ఆయా దేశాలకు సరఫరా చేసింది.