ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను అందజేస్తున్న భారత్‌ను ‘నిజమైన స్నేహితుడు..అమెరికా ప్రభుత్వం

జో బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్‌ను ప్రశంసించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను అందజేస్తున్న భారత్‌ను ‘నిజమైన స్నేహితుడు’గా పిలిచింది. దక్షిణాసియా దేశాలకు ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తూ.. ప్రపంచ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో భారత్‌ పాత్రను అభినందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఉచిత వ్యాక్సిన్‌ను మాల్దీవులు, భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌కు సరఫరా చేసిందని, మరిన్ని దేశాలకు విస్తరిస్తుందన్నారు. ‘భారతదేశం తన ఫార్మాను ఉపయోగించి గ్లోబల్ కమ్యూనిటీకి సహాయం చేస్తోంది’ అని బ్యూరో ఆఫ్ సౌత్, సెంట్రల్ ఆసియా వ్యవహారాల యూఎస్ స్టేట్ డిపార్టమెంట్‌ శుక్రవారం ట్వీట్‌ చేసింది. నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులతో పాటు పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్‌ టీకా డ్రైవ్‌ను ప్రారంభించింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.