కరోనా యూ-టర్న్… కొత్త ఆంక్షలు ప్రకటించిన సీఎం….

*కరోనా యూ-టర్న్… కొత్త ఆంక్షలు ప్రకటించిన సీఎం*

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రజలను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ యూ-టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఇది కరోనా సెకెండ్ వేవ్ కావచ్చా అనేది 8 నుంచి 15 రోజుల్లో తెలుస్తుందని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సాధారణ ప్రజానీకానికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, బయటకు వెళ్లేటప్పుడు సామాజిక దూరం పాటించాలని సూచించారు. కోవిడ్-19పై యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంతో పోలుస్తూ, మాస్క్ ధరించడం ద్వారా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు.

ఫెనాల్టీ వేస్తాం…

కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు వెనుకాడమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామన్నారు. వచ్చే నెలతో రాష్ట్రంలో కోవిడ్ కేసులు వెలుగుచూసి ఏడాది అవుతోందని, మహారాష్ట్రలో ఇంతవరకూ 9 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు వాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు. వాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయనే వదంతుల్లో పసలేదన్నారు. తక్కిన కోవిడ్ వారియర్లు సైతం ఎలాంటి సంకోచం లేకుండా వాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాక్సిన్ పూర్తిగా అందేందుకు సమయం పడుతుందని, అంతవరకూ మందు లేదని, మాస్క్ ధరించడం ద్వారా మనను మనం రక్షించుకోవాలని అన్నారు. నేను బాధ్యతతో ఉన్నాను అనేది మన అందరి న్యూ కోవిడ్ సిద్ధాంతం కావాలని సూచించారు.

ఆంక్షలు సోమవారం నుంచే…

కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో సోమవారం నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉద్ధవ్ థాకరే తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాక్రమాల్లో ప్రజల హాజరను నియంత్రిస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యాక్రమాలన్నీ జూమ్ ద్వారా నిర్వహించుకోవాలని రాజకీయ పార్టీలను కోరారు. బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలు లేవని అన్నారు. ఆయా కార్యాలయాల్లోనూ సిబ్బందిని ఇళ్ల నుంచే పని చేసేందుకు అనుమతించాలని సూచించారు. కొద్ది రోజుల పాటు రాజకీయ, మత సంబంధిత కార్యక్రమాలు, ప్రజలంతా ఒకచోట చేరడం వంటివి ఉండవన్నారు. నిరసనలకు దూరంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.

నాసిక్‌లో నైట్ కర్ఫ్యూ… పండరీపుర ఆలయం 2 రోజులు మూత

కాగా, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నాసిక్‌లో నైట్ కర్ఫ్యూ ఆదివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ అమల్లోకి తెచ్చారు. నిత్యావసరాలపై మాత్రం ఆంక్షలు మినహాయించారు. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు పండరీపురం పాండురంగ విఠల ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించరు. పండరీపురం సిటీలోనూ, సమీపంలోని 10 గ్రామాల్లోనూ 24 గంటల కర్ఫూ విధించారు..