తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ ముమ్మరం….

తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 333 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమం చేపట్టారు. 60 ఏళ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు 171 ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా వేశారు. మొత్తం 8,986 మంది వ్యాక్సిన్‌ పొందారు. 162 ప్రైవేటు ఆస్పత్రుల్లో 12,221 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అలాగే, 917 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు మొదటి డోసు, 3452 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు రెండో డోసు వ్యాక్సిన్‌ అందించారు. 536 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి డోసు వేయగా.. మరో 9 మంది రెండో డోసు అందించినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.ఇప్పటి వరకు 2,00,163 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు మొదటి డోసు, 1,56,968 మందికి రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల విషయానికొస్తే 98,618 మందికి మొదటి డోసు, 31 మందికి రెండో విడత డోసు అందించారు. ఇప్పటి వరకు మొత్తంగా 49,762 మంది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుల ఉన్న వారికి వ్యాక్సిన్‌ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 5,05,542 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.