9 నెలల కనిష్ఠానికి కొత్త కేసులు..గణనీయంగా పెరిగిన కరోనా రికవరీ రేటు….

R9TELUGUNEWS.COM. దేశంలో మరోసారి కరోనా కేసులు తగ్గాయి. 266 రోజుల కనిష్ఠానికి చేరి.. 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు, క్రియాశీల రేటు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది…సోమవారం 10,85,848 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,126 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులు ఫిబ్రవరి ప్రారంభం నాటి స్థాయికి తగ్గాయి. అలాగే కేరళ, తమిళనాడు, మిజోరం, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్.. కేసుల పరంగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి…గత ఏడాది ప్రారంభం నుంచి దేశంలో 3.43 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 11,982 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.40 లక్షలకు తగ్గింది. ఈ సంఖ్య 263 రోజుల కనిష్ఠానికి చేరింది.  దాంతో క్రియాశీల రేటు 0.41 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.25 శాతానికి పెరిగింది. కేరళ గణాంకాలను సవరిస్తుండటంతో మరణాల సంఖ్య భారీగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 332 మరణాలు నమోదుకాగా.. అందులో 262 కేరళవే…ఇప్పటివరకు 4,61,389 మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు నిన్న 59 లక్షల మందికిపైగా టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 109 కోట్ల మార్కును దాటింది._