విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదు..అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు…

విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష జరిపారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడి విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు..అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అశ్రద్ధగా ఉండకూడదన్నారు. శానిటైజర్ లు వాడాలన్నారు. ధర్మ స్క్రీనింగ్ చేయాలని భౌతిక దూరం పాటించాలన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది రెండు డోస్ లు టీకా తీసుకోవాలన్నారు. తెలంగాణలో అక్కడక్కడా కోవిడ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కేసులు ఆందోళన కలిగించాయి.
ఇక్కడి గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులు,ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ పాఠశాలలో ఏకంగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే… నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 43 మంది విద్యార్థులు, ఒక లేడీ లెక్చరర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా మహమ్మారి సోకిన వారిని పాఠశాలలోనే ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. ప్రస్తుతం… కరోనా సోకిన ఆ విద్యార్థులకు… వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్ధులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.