వచ్చే ఏడాది ప్రారంభంలో అవసరం ఉన్న వారికి బూస్టర్‌ డోస్‌ వేసే అవకాశం..సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ అదర్‌ పూనావాలా..

ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ టీకా ముమ్మరంగా సాగుతున్నది. గురువారం దేశంలో కొవిడ్‌ టీకాల పంపిణీ 100 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ అదర్‌ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఇదో ఓ మైలురాయన్నారు. రాబోయే రెండు నెలల్లో దేశం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా బూస్టర్‌ డోస్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అవసరం ఉన్న వారికి బూస్టర్‌ డోస్‌ వేసే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు తగినన్ని డోసులు అందుబాటులో ఉంటాయన్నారు.
నైతికంగా, మానవతా దృక్పథంతో ఆలోచిస్తే.. ప్రపంచ దేశాలకు, ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలకు రెండు మోతాదులు టీకా అందాలి’ అని పూనావాలా పేర్కొన్నారు. ఆఫ్రికా అంతటా కనీసం మూడు శాతం టీకాలు అందలేదని, ఇక్కడ రెండు డోసుల తర్వాత బూస్టర్‌ డోస్‌పై మాట్లాడుతున్నారన్నారు. వృద్ధులు, అవసరమైన వారికి బూస్టర్‌ డోసులు తగినన్ని మోతాదులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వారు, యువత మాత్రం ప్రపంచం రెండు డోసులు పొందే వరకు వేచి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి వేగంగా సాగుతుండడంతో రెండు మోతాదులకు తీసుకునే వారి సంఖ్య సంవత్సరం చివరినాటికి పెరుగుతుందన్నారు.