కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య 12 వారాల వ్యవధి తగ్గించండి : హరీశ్‌రావు

R9TELUGUNEWS.COM కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య ఉన్న వ్యవధిని తగ్గించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య 12 వారాల వ్యవధి ఉండడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా రెండో డోసు వేయడం కష్టంగా ఉందని చెప్పారు. వలస కూలీలు మొదటి డోస్‌ తీసుకొని, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని, వారికి రెండో డోసు వేయడం ఇబ్బందిగా మారిందన్నారు. అంతర్‌రాష్ట్ర కూలీల విషయంలో మరింత ఇబ్బందులు ఉన్నాయన్నారు.

మొదటి డోస్ వేసుకున్నవారి వివరాలు కొవిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నట్టు తెలిపారు. రెండో డోస్ వ్యవధిని గతంలో మాదిరిగా 4-6 వారాలకు తగ్గిస్తే.. టీకా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది టీకాలు తీసుకునేందుకు అర్హులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటి వరకు 3.77 కోట్ల డోసులను వేసినట్లు చెప్పారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, హైరిస్క్‌ గ్రూప్‌ వారికి రెండో డోసు వేసి 8 నుంచి పది నెలల సమయం గడిచిందని, కొత్త వేరియంట్లు వస్తున్న నేపథ్యంలో వారికి బూస్టర్ డోస్ వేయాలని సూచించారు.