టీకాలు 4 కోట్లు..రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌….

టీకాలు 4 కోట్లు..రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌.

★ అహోరాత్రులు శ్రమిస్తున్న 7,970 వాక్సినేషన్‌ బృందాలు

★ 94% మందికి ఫస్ట్‌ డోస్‌.. 50% మందికి రెండో డోస్‌ పూర్తి

★ ఈ నెలాఖరుకు మొదటి డోస్‌ 100% పూర్తి దిశగా కార్యాచరణ

★ రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2,77,67,000

★ వేయాల్సిన మొత్తం డోసులు 5,55,34,000

★ ఇప్పటి వరకు వేసినవి 4,02,79,015

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా గురువారం నాటికి 4 కోట్ల డోసులను వేసింది. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,970 వాక్సినేషన్‌ బృందాలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ పరిధిలో 3,500 కేంద్రాల్లో, ప్రైవేట్‌లో 264 కేంద్రాల్లో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. మొత్తం 35 వేల మంది సిబ్బంది వ్యాక్సినేషన్‌లో పాలుపంచుకొంటున్నారు. ఇందులో 10 వేల మంది వ్యాక్సినేటర్లు ఉన్నారు. ఇప్పటివరకు వేసిన 4 కోట్ల టీకాల్లో ప్రభుత్వ కేంద్రాల నుంచి 87 శాతం పంపిణీ చేయగా, 13 శాతం ప్రైవేట్‌ కేంద్రాల్లో వేశారు. కాగా, టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యాచరణ అమలు చేస్తున్నది. అర్హులను 44 క్యాటగిరీలు విభజించి టీకాలు వేస్తూ వస్తున్నది. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరికి టీకా వేస్తున్నది. ప్రయాణ ప్రాంగణాలు, పని ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి టీకాలు వేస్తున్నది.

నెలాఖరులోగా వందశాతం
——————-
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నెలాఖరులోగా కనీసం ఒక డోస్‌ వేయాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల ఆదేశించారు. దీంతో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమిస్తున్నది. గురువారం నాటికి 2,62,11,799 మందికి మొదటి డోస్‌ వేశారు. 94.3 శాతం మందికి పూర్తి చేశారు. మరో 15.55 లక్షల మందికి టీకా వేయాల్సి ఉన్నది. 1.40 కోట్ల మందికి రెండో డోస్‌ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 58 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయి. నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేస్తామని వైద్యసిబ్బంది చెప్తున్నారు.

టీకా వేసుకోండి.. సురక్షితంగా ఉండండి
————————-
తెలంగాణ 4 కోట్ల కొవిడ్‌ టీకాల మైలురాయిని దాటడం సంతోషంగా ఉన్నది. కరోనా వైరస్‌ను ఓడించేందుకు మేము సైతం అంటూ టీకా వేసుకొన్న ప్రతి పౌరుడికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలి. మీతోపాటు మిమ్మల్ని అమితంగా ప్రేమించేవారికి వెంటనే రెండు డోసు ల టీకాలు వేసి రక్షణ కల్పించండి.
ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు
తన్నీరు హరీశ్‌ రావు