కరోనా కథ ముగిసింది!: డబ్ల్యూహెచ్‌ఓ..

ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించిన కరోనా కథ ముగిసినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. కోవిడ్‌-19 తాలూకు అత్యంత భయానకమైన దశ ముగిసిపోయినట్టేనని వెల్లడించింది. ”వైరస్‌ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఆ మహమ్మారి తోకముడిచే రోజులు వచ్చేశాయి. ఇకపై కేసుల అంతగా పెరుగుదల ఉండదు. అలాగని పూర్తిగా తగ్గి జీరో కేసులకు వచ్చే పరిస్థితి కూడా లేదు” అని అంచనా వేసింది. ”రెండున్నరేళ్లుగా మనం చీకటి గుహలో బతుకులు వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు గుహ చివర్లో వెలుగు రేఖ కనిపిస్తోంది.

అయితే అక్కడికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరముంది. అప్రమత్తంగా లేకుంటే ఇంకా ఎన్నో అడ్డంకులు వస్తాయి” అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అన్నారు. గురువారం ఆయన ఐరాస సర్వప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ బలహీనపడిపోయిందని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ గౌతమ్‌ మీనన్‌ కూడా అన్నారు. ఆయన తొలినుంచీ కరోనా కేసుల్ని ప్రపంచవ్యాప్తంగా ట్రాక్‌ చేస్తున్నారు. కరోనా వైరస్‌కు మన శరీరాలు అలవాటు పడిపోయాయని, ఇక ఆ వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడం జరగదని ఆయన ధీమాగా చెప్పారు.