జనవరి మొదటి వారంలో మూడో వేవ్‌..!!!

126కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు…

ఒమిక్రాన్‌ కారణంగా ఇండియాలో జనవరి మొదటి వారంలో మూడో వేవ్‌ ప్రారంభం కావొచ్చని నేషనల్‌ కొవిడ్‌ సూపర్‌ మోడల్‌ కమిటీ అంచనా వేసింది. కరోనా కేసులు ఫిబ్రవరి చివరి వారంలో గరిష్ఠ స్థాయికి వెళ్లవచ్చని పేర్కొన్నది. అయితే సెకండ్‌ వేవ్‌తో పోల్చితే ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చని తెలిపింది. డెల్టా వేరియంట్‌ సమయంలో చాలామంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదని గుర్తు చేసింది. ‘దేశంలో వ్యాక్సినేషన్‌ మార్చిలో ప్రారంభమైంది. డెల్టా వేరియంట్‌ వచ్చేటప్పటికి చాలామంది వ్యాక్సిన్‌ వేసుకోలేదు. దీంతో ఉద్ధృతంగా వ్యాపించింది. ప్రస్తుతం భారత్‌లో సీరో పాజిటివిటీ రేటు 75-80 శాతం మధ్యలో ఉంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు సహజ నిరోధకత ఉంది. 85% మంది ఒక్క డోసు టీకా వేసుకొన్నారు. సగం మంది రెండు డోసులు వేసుకొన్నారు. ఎంత పరిస్థితి చేయిదాటిపోయిందని అనుకొన్నా రోజువారీ కేసులు 2 లక్షలు దాటవు’ అని కమిటీ హెడ్‌, ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తిపై అంచనాల కోసం కేంద్రం నేషనల్‌ కొవిడ్‌ సూపర్‌ మోడల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తదితరులు ఉన్నారు…

126కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు.

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు 126కు చేరాయి. శనివారం కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో తాజాగా నమోదైన మూడు కేసులతో మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, తెలంగాణలో 8, గుజరాత్‌లో 7, ఏపీ, చండీగఢ్‌, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున కేసులు నమోదయ్యాయి….