కొత్త వేరియంట్ రూపంలో మ‌ళ్లీ భారత్ లొకి కరోనా…దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో ఒమిక్రాన్ ఎక్స్ఈ తొలి కేసు న‌మోదైంది….

నిన్నా మొన్న‌టి దాకా యూర‌ప్‌లో క‌నిపించిన ఈ ఒమిక్రాన్ కొత్త‌ వేరియంట్.. ఇప్పుడు ఇండియాకు కూడా వ‌చ్చేసింది. ..

కొత్త వేరియంట్ రూపంలో మ‌ళ్లీ మ‌న మీద విరుచుకుప‌డేందుకు వ‌స్తున్న‌ది. నిన్నా మొన్న‌టి దాకా యూర‌ప్‌లో క‌నిపించిన ఈ ఒమిక్రాన్ కొత్త‌ వేరియంట్.. ఇప్పుడు ఇండియాకు కూడా వ‌చ్చేసింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో ఒమిక్రాన్ ఎక్స్ఈ తొలి కేసు న‌మోదైంది. దీంతో ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ క‌ల‌వ‌రం మొద‌లైంది. అస‌లు ఈ వేరియంట్ ఎలా ఉండ‌బోతుంది? దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలియ‌క కంగారుప‌డిపోతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఈ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధ‌మ‌వ్వాలో తెలుసుకుందాం..

కొత్త వేరియంట్ ల‌క్ష‌ణాలు
ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్నది. అయితే కొందరికి స్వల్పంగానూ, మరికొందరికి తీవ్రంగానూ లక్షణాలు ఉంటున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గరగర, దగ్గు, జలుబు, చర్మంపై దద్దర్లు, రంగు మారడం, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ సోకిన వారిలో ప్రధానంగా కనిపించనున్నాయి. అలసట, కళ్లు తిరగడం వంటివి ప్రారంభంలో కనిపించే కొన్ని లక్షణాలు. తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, జ్వరం వంటి తర్వాత కనించే లక్షణాలు. గుండె దడ, గుండె జబ్బులు, తీవ్రమైన నరాల వ్యాధులు వంటి తీవ్రమైన లక్షణాలు కూడా ఈ వేరియంట్‌ వల్ల కలగవచ్చని తెలుస్తున్నది.

మరోవైపు వాసన, రుచి కోల్పోవడం వంటి అత్యంత సాధారణమైన కరోనా లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌ బారినపడిన వారిలో చాలా అరుదుగా ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఒకరి టీకా స్థితి, మునుపటి ఇన్ఫెక్షన్ల నుంచి పొందిన రోగనిరోధక శక్తి, వైరస్‌ తీవ్రత వంటివి కూడా ఆధారపడి ఉంటాయి. ఒమిక్రాన్‌ బీఏ.2 వేరియంట్‌ కన్నా పది శాతంమేర ఇది వ్యాపించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆధారాలు ఇప్పటి వరకు లేకపోవడం కొంత ఊరటనిస్తున్నది.

నిర్ల‌క్ష్యం వ‌ద్దు..అక్క‌డెక్క‌డో ముంబైలో క‌దా.. మ‌న ద‌గ్గ‌ర కేసులు వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే.. అన్న అశ్ర‌ద్ధ త‌గ‌దు. ఆరోగ్య శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసే దాకా ఆగ‌కుండా ముందు నుంచే జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఇక మీ ఏరియాలో కేసులు న‌మోద‌వ్వ‌డం మొద‌లైందంటే.. మరింత అప్ర‌మ‌త్త‌తో ఉండాలి. బ‌హిరంగ ప్రదేశాల‌కు వెళ్తే ఖ‌చ్చితంగా మాస్కులు ధ‌రించాలి.

మాస్కులు వాడాలి….
గ‌త రెండేండ్లుగా మాస్కులు వాడి వాడి జ‌నాలు అల‌సిపోయారు. పైగా కొద్దిరోజులుగా కొవిడ్ కేసులు త‌క్కువ‌గా న‌మోదు కావ‌డం.. ఒక‌వేళ క‌రోనా సోకినా దాని ప్ర‌భావం ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో చాలామంది మాస్కుల‌ను పెట్టుకోవ‌డం మానేశారు. అంతేకాదు క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే అన్న నిర్ల‌క్ష్య ధోర‌ణిలోకి వ‌చ్చేశారు. కానీ అంత ప‌ట్ట‌న‌ట్టు ఉండ‌టం కూడా మంచిది కాదు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసులు న‌మోదవుతున్నాయి కాబ‌ట్టి మాస్కులు వాడ‌టం త‌ప్ప‌నిస‌రి. పాజిటివ్ కేసులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటే.. నాణ్య‌మైన మాస్కుల‌ను వాడాలి. వీలైతే ఎన్ 95 మాస్కులు వాడ‌టం ఉత్త‌మం.

టెస్ట్ కిట్లు అందుబాటు ఉంచుకోండి..
మ‌రీ సీరియ‌స్‌గా ఉన్న‌ప్పుడు ఆరోగ్య కేంద్రాల‌కు వెళ్లి టెస్ట్ చేయించుకుందామ‌ని అనుకోవ‌ద్దు. అప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉంటాయో తెలియ‌దు. కాబట్టి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అనిపించినా.. ముంద‌స్తుగా కొవిడ్ టెస్ట్ కిట్ల‌ను కొనుగోలు చేసి ద‌గ్గ‌ర పెట్టుకోవ‌డం మేలు.

బూస్ట‌ర్ డోస్ తీసుకోవాలి
ఇప్ప‌టికే దేశంలో చాలావ‌ర‌కు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు అది మాత్ర‌మే స‌రిపోద‌ని.. బూస్ట‌ర్ డోస్ కూడా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇటీవ‌ల కాలంలో క‌రోనా బారిన ప‌డితే మాత్రం కొద్ది నెల‌ల వ‌రకు బూస్ట‌ర్ డోస్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత లేదా క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత మ‌న శ‌రీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అవి నాలుగు నుంచి ఐదు నెల‌ల వ‌ర‌కు మ‌న శ‌రీరానికి ర‌క్ష‌ణ ఇస్తాయి.

ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ ద‌గ్గ‌ర ఉంచుకోవాలి
క‌రోనా సోకిన వారిలో ఆక్సిజ‌న్ స్థాయులు త‌గ్గిపోయే అవ‌కాశం ఉంటుంది. ఆక్సిజ‌న్ స్థాయులు త‌క్కువ అయితే కొవిడ్ న్యుమోనియా సోకే లేదా ఆరోగ్యం విష‌మించే అవ‌కాశం ఉంటుంది. శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 92 కంటే త‌క్కువ అయిన‌ప్పుడు ఆస్ప‌త్రిలో చేరాల్సి వ‌స్తుంది. కాబట్టి ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను చెక్ చేసుకునేందుకు ప‌ల్స్ ఆక్సిమీట‌ర్‌ను ఇంట్లో అందుబాటులో ఉంచుకోవాలి.

తిరుగుడు ఇప్పుడే వ‌ద్దు..
దాదాపు రెండేండ్లుగా జ‌నాలు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. పెండ్లిండ్లు, ఇత‌ర‌త్రా శుభ‌కార్యాల‌ను కూడా వాయిదా వేసుకుంటూ వ‌చ్చారు. గ‌త కొంత‌కాలంగా కొవిడ్‌ కేసులు త‌గ్గిపోవ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు పెండింగ్‌లో పెట్టిన టూర్‌లు, ఫంక్ష‌న్ల‌ను ఈ టైమ్‌లో చేసుకునేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్త వేరియంట్ వ‌స్తున్న స‌మ‌యంలో వీటిని మ‌ళ్లీ పెండింగ్‌లో పెట్ట‌డ‌మే బెట‌ర్ అని నిపుణులు సూచిస్తున్నారు. మరీ అత్య‌వ‌స‌ర‌మైతే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని ప్ర‌యాణాలు చేయ‌డం మంచిద‌ని చెబుతున్నారు.