కొవిడ్ తగ్గించే వ్యూహానికి అక్కడి అధికారులు వింత ఆదేశాలు…!!!

China:

ఉత్తర కొరియాలో కరోనా ఉద్ధృతి..
చైనాను బెంబెలెత్తిస్తోంది. దీంతో తమ కొవిడ్ జీరో వ్యూహానికి ఇబ్బంది రాకుండా అక్కడి అధికారులు వింత ఆదేశాలు ఇస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి వీస్తున్న కొవిడ్ గాలి నుంచి రక్షించుకునేందుకు సరిహద్దు ప్రాంత ప్రజలు కిటికీలు మూసుకోవాలని సూచిస్తున్నారు. ఆ గాలి ద్వారా చైనా వైపునకు మహమ్మారి ప్రయాణిస్తుందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనం వెలువరించింది. చైనా నగరం డాన్‌డాంగ్. ఉత్తర కొరియాతో సరిహద్దు పంచుకుంటోంది. ఈ రెండింటినీ ఓ నది విడదీస్తోంది. దాంతో ఆ దేశం, ఈ నగరానికి మధ్య దూరం వందల మీటర్ల మేర ఉంటుంది. ఇటీవల కాలంలో చైనాలో పలు నగరాల్లో కరోనా ఉద్ధృతి చూపింది. కానీ, డాన్‌డాంగ్ ప్రాంతంలో మాత్రం పెద్దగా కేసులు రాలేదు. కానీ, ఇప్పుడు అక్కడ కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అనూహ్యంగా విస్తరిస్తున్న ఇన్ఫెక్షన్లకు కారణమేంటో అర్థంగాక స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాంతో ఉత్తరకొరియా వైపుగా ఉన్న యాలు నదీ ప్రాంతవాసులు మాత్రం కిటీకీలు మూసిపెట్టుకోవాలని సూచిస్తున్నారు. అధికారులు చేస్తున్న ఈ సూచనలు వైద్య సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీనిపై ప్రజారోగ్య నిపుణుడు లియో పూన్ మాట్లాడుతూ.. ‘కొవిడ్ పార్టికిల్స్ ఇంతదూరం ప్రయాణించగలదనే దాని గురించి నేను ఇంతకు ముందు వినలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఒక విశాలమైన గదిలో వైరస్ ప్రయాణిస్తుంది. ఇది గ్రామాలు దాటి వస్తుందా..? నేను అలా అనుకోవడం లేదు’ అని మరో వైద్యాధికారి తాజా సూచనలను ప్రశ్నించారు. కరోనా కట్టడి విషయంలో ప్రపంచ దేశాలకు భిన్నంగా చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఆ దేశం పాటించే కొవిడ్ జీరో వ్యూహంపై సొంత ప్రజలే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ, చైనా నాయకత్వం మాత్రం తన విధానాన్ని సమర్థించుకుంటోంది. విమర్శకులపై చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ ఏడాది టెస్టింగ్, వైద్య సదుపాయాలు, ఇతర కొవిడ్ కట్టడి చర్యల కోసం 52 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేయనుందట. దీనివల్ల 3 వేల సంస్థలు లాభపడనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు…!!_.