కరోనా కలకలం రేపుతోంది…పోస్ట్‌ కొవిడ్‌లో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం అంటు హెచ్చరికలు..!!!

కరోనా మొదటి, రెండో దశలో వైరస్‌ పేరు వింటేనే హడలిపోయిన జనం.. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌లో దవాఖానలో చేరికలు, మరణాలు పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కరోనాపై ప్రజల్లో భయాందోళనలు పూర్తిగా తొలగిపోయినట్లు చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో కూడా ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు బీ.ఏ.1, బీ.ఏ.2ల మిశ్రమమైన బీ.ఏ.4, బీ.ఏ.5 ఉండటంతో ఈ కేసుల్లో కూడా తీవ్రత ఉండబోదనే వార్తలు వినిపిస్తుండటం కూడా ప్రజల్లో నెలకొన్న నిర్లక్ష్యానికి కారణంగా వైద్యనిపుణులు భావిస్తున్నారు.స్వల్ప లక్షణాలతో చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రమాదం పొంచి ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా.. సాధారణ ప్రజలు సైతం కరోనా వైరస్‌కు గురైతే స్వల్ప లక్షణాలే కనిపించినా.. పోస్ట్‌ కొవిడ్‌ ముప్పు తప్పదని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు సూక్ష్మమే.. .తర్వాతే విశ్వరూపం..
ఇప్పుడు స్వల్ప లక్షణాలతో బయటపడినా.. పోస్ట్‌ కొవిడ్‌లో వైరస్‌ ప్రభావం విశ్వరూపం చూపించే ప్రమాదం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. కరోనా థర్డ్‌వేవ్‌లో స్వల్ప లక్షణాలతో బయటపడిన చాలా మంది రోగులు పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో దవాఖానలకు క్యూ కట్టడమే ఇందుకు నిదర్శనమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో దాదాపుగా స్వల్ప లక్షణాలు, మరికొంత మందిలో లక్షణాలు కనిపించడం లేదని, దీని వల్ల అదృష్టవశాత్తు దవాఖానల్లో చేరికలు చెప్పుకోదగినంత లేవని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

కానీ..ఇప్పుడు స్వల్ప లక్షణాలతో బయట పడినా.. పోస్ట్‌ కొవిడ్‌లో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మందికి పోస్ట్‌ కొవిడ్‌లో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా మృత్యువాత పడిన, పడుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. పోస్ట్‌ కొవిడ్‌లో ముఖ్యంగా రక్తం గడ్డకట్టడం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం వంటివి దెబ్బతినడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నట్లు డాక్టర్‌లు వివరించారు.

వారికి ముప్పు ఎక్కువ..
ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో పెద్దగా లక్షణాలు లేకపోవడంతో చాలా మంది కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదు. దీంతో వైరస్‌కు గురైన రోగులు తమ ఇండ్లలోని చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాధిని చేరవేస్తున్నారు. అంతే కాకుండా వారు పనిచేసే కార్యాలయాల్లో, పనిచేసే కంపెనీలు తదితర ప్రదేశాల్లో తోటి ఉద్యోగులు, కార్మికులకు, మార్కెట్లు, దేవాలయాలు, జాతరలు తదితర పబ్లిక్‌ ప్రాంతాల్లో ఇతరులకు వైరస్‌ను పరోక్షంగా అంటిస్తున్నారని, దీని వల్ల వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.