చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు… వూహాన్‌లో పాక్షిక లాక్‌డౌన్…

చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి మూలంగా భావిస్తున్న వూహాన్‌ నగరంలో మంగళవారం కొత్తగా 18 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ నగరంలో పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించారు. హన్యాంగ్ జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. నివాసితులు ఆదివారం వరకు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. నిత్యవసరం కాని వ్యాపారాలు బుధవారం నుంచి మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేశారు. వినోద వేదికలను మూసివేశారు. జనం కదలికలపై ఆంక్షలు విధించారు. చారిత్రక పర్యాటక ప్రాంతాలకు నియలమైన హన్యాంగ్‌ జిల్లా వ్యాప్తంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు శీతాకాలం ప్రవేశించడంతో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ విజృంభించవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సగటున నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య 16.7 మిలియన్ల నుంచి ఫిబ్రవరి నాటికి 18.7 మిలియన్లకు చేరవచ్చని అంచనా వేసింది. గత శీతాకాలంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌ విజృంభణతో 2022 జనవరిలో సగటున 80 మిలియన్‌ కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది…!!