కోర్టుల ఆధునీక‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర న్యాయం…

R9TELUGUNEWS.COM: కాక‌తీయ రాజులు అందించిన ఘ‌న‌మైన వార‌స‌త్వానికి దీటుగా హ‌నుమ‌కొండ నూత‌న‌ కోర్టు భ‌వ‌నాలు తీర్చిదిద్ద‌బ‌డ్డాయి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌శంసించారు.
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోయినా తెలంగాణ ప్ర‌భుత్వం నిధులు ఇచ్చి కోర్టు భ‌వ‌నాల‌ను నిర్మించింది. న్యాయ వ్య‌వ‌స్థ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన గౌర‌వం ఇది అని పేర్కొంటూ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

హ‌నుమ‌కొండలో నూత‌నంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభించిన అనంత‌రం ఎన్వీ ర‌మ‌ణ మాట్లాడారు. కోర్టుల ఆధునీక‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రుగుతుంది. శిథిలావ‌స్థ‌లోని కోర్టుల‌ను పున‌ర్నిర్మాంచాల‌ని సీజేఐ అయ్యాక అనుకున్నాను. ఆ త‌ర్వాత కోర్టుల్లో సౌక‌ర్యాల కోసం అన్ని రాష్ట్రాల నుంచి స‌మాచారం తెప్పించాం. కోర్టుల్లో మౌలిక సౌక‌ర్యాల ప్ర‌త్యేక సంస్థ ఏర్పాటుపై జులైలో కేంద్రానికి ఇండియ‌న్ జ్యుడిషీయ‌రీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ ఏర్పాటుపై ప్ర‌తిపాద‌న పంపాం. ఆధునీకర‌ణ ద్వారానే స‌త్వ‌ర న్యాయం అందించ‌గ‌ల్గుతామ‌ని చెప్పాను. న్యాయ మంత్రిత్వ శాఖ‌, కేంద్రం నుంచి స‌మాధానం రాలేదు. ప్ర‌త్యేక సంస్థ‌పై పార్ల‌మెంట్ స‌మావేశాల్లో చ‌ట్ట రూపంలో తెస్తార‌ని ఆశిస్తున్నాను.

వ‌రంగ‌ల్‌లో కోర్టుల పున‌ర్నిర్మాణానికి జ‌స్టిస్ న‌వీన్‌ రావు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. నా భావాల‌కు అనుగుణంగా ఈ కోర్టు భ‌వ‌న స‌ముదాయాన్ని నిర్మించారు. స‌క‌ల స‌దూపాయాల‌తో నిర్మించిన ఈ కోర్టుల‌ భ‌వ‌న స‌ముదాయాన్ని పుస్త‌క రూపంలో కానీ, వీడియోగా చిత్రీక‌రించి నాకు పంపండి. దీన్ని మిగ‌తా రాష్ట్రాల‌కు పంపించి మోడ‌ల్ కోర్టు భ‌వనంగా ఆచ‌రించాల‌ని చెప్పాల‌నుకుంటున్నాను. కేసులు పేరుకుపోవ‌డానికి న్యాయ‌మూర్తుల కొర‌త ఒక్క‌టే కాదు. స‌రియైన‌టువంటి మౌలిక వ‌స‌తులు లేకుండా న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు ప‌ని చేయ‌లేక‌పోతున్నారు. కోర్టుల్లో మౌలికవసతులు, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సి ఉంద‌ని ఎన్వీ ర‌మ‌ణ అన్నారు.

*రాజ‌కీయాల్లోకి న్యాయ‌వాదులు రావాలి*

ఒక‌ప్పుడు రాజ‌కీయాల్లో న్యాయ‌వాదుల సంఖ్య అధికంగా ఉండేది. ఇప్పుడు రాజ‌కీయాల్లో న్యాయ‌వాదుల సంఖ్య త‌గ్గింది. ఈ సంఖ్య‌ను పెంచి, స‌మాజానికి మంచి చేయాల్సి అవ‌స‌రం ఉంద‌న్నారు. కుటుంబం, వృత్తితో పాటు సమాజం, రాష్ట్రం, దేశం గురించి కూడా న్యాయ‌వాదులు ఆలోచించాలి అని ఎన్వీ ర‌మ‌ణ సూచించారు.