కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి భేటీ..

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి భేటీ అయ్యారు. నిన్న రాత్రి సోనియా నివాసానికి వెళ్లిన పీకే.. ఆమెతో సుదీర్ఘంగా చర్చించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు మరికొద్ది నెలల్లో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వీరు చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా.. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో పీకే భేటీ అవడం 3 రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం…అంతకుముందు గత శనివారం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో సమావేశమైన పీకే.. మిషన్‌ 2024పై సవివర ప్రజెంటేషన్ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. తాజా భేటీలో ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలపై పీకే.. సోనియాతో చర్చించినట్లు సమాచారం. యూపీ, బిహార్‌, ఒడిశాలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయాలని.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌కు సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రణాళిక రచించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి…అయితే పీకే ప్రజెంటేషన్‌పై స్పందించేందుకు కాంగ్రెస్‌ కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున హస్తం పార్టీ తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశముంది. మరోవైపు పీకేను కాంగ్రెస్‌లో చేరాలని పార్టీ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆయన పార్టీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి…గుజరాత్‌, హిమాచల్‌లో పరిస్తితి పే చేర్చ….
పీకేతో భేటీకి ముందు సోనియా గాంధీ.. కాంగ్రెస్‌ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో విజయం కోసం ఎలాంటి వ్యూహాలు జరపాలన్నదానిపై చర్చలు జరిపారు. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో చిదంబరం, కేసీ వేణుగోపాల్‌, అంబికా సోని, ప్రియాంక గాంధీ వాద్రా, ముకుల్‌ వాస్నిక్‌, జైరాం రమేశ్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.