అయోధ్యపై కాంగ్రెస్‌ డైలమా..!!?..బీజేపీకి పరిస్థితులు అనుకూలం కావటానికి వీలు కల్పిస్తుంది..!!?

అయోధ్య గురించిన చర్చ ఎప్పటినుంచో ఉన్నదే అయినా, తమకు అందిన ఆహ్వానంపై కాంగ్రెస్‌ నాయకత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. దానినిబట్టే ఈ విషయమై పార్టీకి ఒక డైలమా ఎదురైనట్టు అందరికీ అర్థమైంది.!!?

కాంగ్రెస్‌ తనను తాను సెక్యులర్‌గా ప్రకటించుకున్నందున వాస్తవానికి ఎటువంటి డైలమా ఉండకూడదు. అయోధ్య ఆహ్వానం రాగలదన్నది ముందే తెలిసిన విషయమైనప్పుడు, నిర్ణయం కూడా ఎంతో ముందుగానే తీసుకొని ఉండవలసింది. కానీ, ఆ పని ఎందుకు చేయలేకపోయింది? చివరికి, తాము రామునికి గాని, ఆలయానికి గాని వ్యతిరేకం కాదని, ఆ కార్యక్రమాన్ని బీజేపీ ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చినందున, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లాభపడజూస్తున్నందున, ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నామని వివరించబూనింది…

ఇదంతా మనం చిరకాలంగా చూస్తున్నదే. అదే స్థితి ఇప్పుడు అయోధ్య సందర్భంగా మరొకసారి ముందుకువస్తున్నది. అయితే, దీనంతటికి భిన్నంగా కాంగ్రెస్‌ చెప్తూ వస్తున్నది, చేస్తూ వస్తున్నది ఏమిటి? సెక్యులరిజాన్ని నిలబెట్టడానికి గాని, హిందూ మతతత్వ భావనలు వ్యాపించకుండా నిరోధించేందుకు గాని వారి వ్యూహం ఏమిటి? ఆ ప్రకారం చేసిన ఆచరణలు ఏమిటి? అన్నవి ఆలోచించవలసిన ప్రశ్నలు. అవి అర్థమైతే తప్ప, కాంగ్రెస్‌ డైలమాలు, సంకట పరిస్థితులు, తరచూ కనిపించే తడబాట్లు, ద్వంద్వనీతి మనకు అర్థం కావు.

కాంగ్రెస్‌ పార్టీ తమది సెక్యులర్‌ విధానమని మొదటనే ప్రకటించింది. తర్వాత ఆ మాటను రాజ్యాంగంలో చేర్చింది. అంతవరకు పార్టీ విధానం పూర్తిగా సమర్థించదగినదే. దేశ జనాభా స్థితిగతులను బట్టి, దేశ విభజన పరిస్థితులను బట్టి, దేశం ఆధునిక ప్రజాస్వామ్య మార్గంలో పురోగమించవలసిన లక్ష్యాలను బట్టి అది సరైన నిర్ణయమే. కానీ, సెక్యులరిజం అనే మాటను నిర్వచించటంలో, ఆచరించటంలో తొలుతనే సమస్యలు ఎదురయ్యాయి. మనది మతాతీత వ్యవస్థా లేక, సర్వమత సమభావనా వ్యవస్థా అన్నది మొదటి చర్చ అయింది. ఆ చర్చల వివరాల్లోకి పోలేముగాని మొత్తానికి అదొక అస్పష్ట నిర్వచనంగా మిగిలిందని గుర్తించాలి. ఆ కారణంగా ఆచరణ కూడా అస్పష్టమైన విధంగానే సాగింది. ఇందువల్ల అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, మనది ఎవరు అవునన్నా కాదన్నా హిందూ మెజారిటీ దేశం అయినందున, ఈ అస్పష్టతలు క్రమక్రమంగా కాంగ్రెస్‌ డైలమాలకు, బీజేపీకి పరిస్థితులు అనుకూలం కావటానికి వీలు కల్పించాయి…
యథాతథంగా ఈ నిర్వచన అస్పష్టతలు, ఆ ప్రకారం ఆచరణ అస్పష్టతలు ఇందుకు ఒక కారణమైతే, అంతకన్న అనేక రెట్లు కారణమైన విషయం మరొకటి ఉంది. అది, మన దేశంలో సెక్యులరిజం అనేది సరైన పునాదులపై నిలబడేందుకు, బలంగా నిర్మాణమయ్యేందుకు చేయవలసిందేమిటనే అవగాహన గాని, వ్యూహం గాని, అందుకు తగిన ఆచరణగాని కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ లేవు. ఇటువంటి అవగాహనకు, వ్యూహానికి, ఆచరణకు ఇరుసుగా పనిచేసే అతి కీలకమైన అంశం అన్నివర్గాల అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలన. కాంగ్రెస్‌ నాయకత్వం ఈ విషయాల్లో విఫలం కావటానికి, అందుకు పర్యవసానంగా సెక్యులర్‌ ప్రకటనల వైఫల్యానికి అవినాభావ సంబంధం ఉన్నది. ఈ వైఫల్యాలన్నింటి ఫలితంగా అన్ని విధాలుగానూ ఒక పెద్ద శూన్యం ఏర్పడి, ఆ శూన్యంలోకి బీజేపీ విజయవంతంగా ప్రవేశించింది.

వరుసగా కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించి కూడా కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాలే మౌలికంగా అరకొరగా మిగిలాయి. కనుక అన్నివర్గాల అభివృద్ధి అనేది గాని, అన్నివర్గాల సంక్షేమం అన్నది గాని కూడా అరకొరగానే ఉండిపోయాయి. మరొకవైపు సమర్థవంతమైన పరిపాలనా లేకపోయింది. ఇవి చాలవన్నట్టు విపరీతమైన అవినీతి, నిరుద్యోగం, పేదరికం, పైనుంచి కిందివరకు దోపిడీ. ఈ స్థితికి, సెక్యులరిజానికి, బీజేపీ బలోపేతం కావటానికి గల కార్యకారణ సంబంధాన్ని సూక్ష్మంగా ఒక మాటలో చూద్దాం. అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనా వైఫల్యాల చెడు ప్రభావాలు హిందువులపై, ముస్లింలపై కూడా ఉన్నాయి. మతాలతో సంబంధం లేకుండా అందరిపై గల ప్రభావాల గురించి అనేక అధ్యయనాలున్నాయి. ముస్లింల విషయమై జస్టిస్‌ రాజేంద్ర సచార్‌ ప్రత్యేక నివేదిక ఉన్నది. అయినప్పటికీ తమ వెనుకబాటుకు కాంగ్రెస్‌ తదితర పార్టీలు ముస్లింలను ‘బుజ్జగించట’మే కారణమని హిందువులను నమ్మించేందుకు బీజేపీకి మంచి అవకాశం లభించింది. అందుకు సెక్యూరిటీ అంశాలు, కశ్మీర్‌, పాకిస్థాన్‌ వంటివి కూడా వారికి కలిసివచ్చాయి.

వీటికి వేటికీ కాంగ్రెస్‌ వద్ద సమాధానాలు లేకపోయాయి. ఎప్పుడైనా, ఏ సమాజంలోనైనా మతం, జాతీయత, దేశ భద్రత అనే మూడు కూడా బలమైన అంశాలు. ఇంగ్లీషు మాటల్లో చెప్పాలంటే బేసిక్‌ ఇన్‌స్టింక్ట్స్‌ వంటివి. ఈ మూడింటిలో కాంగ్రెస్‌ పరిస్థితి గానీ, సెక్యులర్‌ విధానం గానీ ప్రజల్లో బలంగా పాదుకొనాలంటే అన్నింటికి ముందు జరగవలసింది ప్రజలందరినీ అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన విషయాల్లో సంతృప్తిగా ఉంచటం. ఇంచుమించు అన్నింటికి, దాదాపు అన్ని పరిస్థితుల్లో అదే పునాది అవుతుంది. అసాధారణ పరిస్థితులు ఏవైనా తలెత్తితే తప్ప. కానీ కాంగ్రెస్‌ వరుస వైఫల్యాలు మనకు తెలిసినవే..

దశాబ్దాల కాలపు నూటొక్క వైఫల్యాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజుకు కూడా కోలుకోలేదు. ఇప్పటికీ వారికి సెక్యులరిజం నిర్వచనంపైగాని, దాని ఆచరణపై గాని స్పష్టత లేదు. అందరి అభివృద్ధి, అందరి సంక్షేమం, సమర్థవంతమైన పాలనపై విధానాలు లేవు, చిత్తశుద్ధి లేదు. ఓట్ల కోసం రకరకాల సరికొత్త డ్రామాలు తప్ప. అయోధ్యపై నాయకత్వానిది డైలమా, అస్పష్టత అయితే అదే పార్టీ నాయకులు వేర్వేరు స్వరాలతో మాట్లాడుతుండటం వెనుక ఈ విధమైన దశాబ్దాల వైఫల్యాలు మూల కారణంగా ఉన్నాయి. పార్టీ ప్రస్తుత నాయకత్వం బలహీనమైనది గనుక ఈ చారిత్రక వైఫల్యాలు కాంగ్రెస్‌ను భవిష్యత్తులోనూ వెంటాడుతూనే ఉంటాయి..!!