కాంగ్రెస్ పార్టీ నెల 20న నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో సభ..!సభకు ప్రియాంకా గాంధీ…!

హైదరాబాద్‌: ఖమ్మం వేదికగా లక్షలా­ది మందితో జనగర్జన సభ నిర్వహించి కొత్త జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మరో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమ­వు­తోంది. ఈ నెల 20న నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో సభ నిర్వహించాలని భావి­స్తోంది. ఖమ్మం సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య­అతిథిగా రాగా, కొల్లాపూర్‌ సభకు ప్రియాంకాగాంధీ హాజర­య్యే అవకాశముంది. ఈ మేరకు కొల్లాపూ­ర్‌ సభకు హాజరు కావాలని కోరుతూ ప్రియాంకా గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్‌ పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 20న ప్రియాంక సభ ఖరారైనట్టేనని, అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ప్రియాంక హాజరయ్యే సభలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

*కీలక ప్రకటనలు కూడా…*

జూపల్లి చేరిక సభలో ప్రియాంకగాంధీ చేత కీలక ప్రకటనలు ఇప్పించేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ఖమ్మం వేదికగా వృద్ధులు, వితంతువులు, ఇతర వర్గాల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతూ హామీ ఇచ్చినట్టుగానే, కొల్లాపూర్‌ సభావేదికగా మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా భారీ ఎన్నికల హామీ ఇస్తామని, ఇందుకోసం నాలుగైదు అంశాలను పరిశీలిస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సుప్రయాణ హామీని ప్రకటించే అవకాశాలున్నాయని వారంటున్నారు. దీంతోపాటు పావలా వడ్డీరుణాల స్థానంలో మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామని, రూ.లక్ష వరకు ఈ రుణం ఇస్తామని, నామినేటెడ్‌ పదవుల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీలను కూడా ఇప్పించే అంశాలను టీపీసీసీ ముఖ్య నేతలు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ప్రియాంకాగాంధీ సభ ద్వారా మహిళలకు భారీ ఎన్నికల హామీని ప్రకటించేందుకు కాంగ్రెస్‌ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది.