ఇది సంధికాలం. ఇప్పుడే అసలైన జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఇక అంతే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

చలికాలం మొల్లగా ఎండాకాలంగా మారుతోంది. మధ్యలో ఇది సంధికాలం. ఇప్పుడే అసలైన జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఇక అంతే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తోంది.. వచ్చేస్తోందని చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు అనుకున్నదే జరుగుతోంది. కోవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు ఐదు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇది సెకండే వేవ్‌కి సంకేతం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. వందల సంఖ్యలో కాకపోయినా.. పెరుగుదల మాత్రం ఉంది.అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా పుణెలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త నిబంధనలను విడుదల చేస్తామని పుణె డివిజనల్ కమిషనర్ చెప్పారు. మహారాష్ట్రలో 6,281 కొవిడ్‌ కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క ముంబైలో 897 కొత్త కేసులు రికార్డయ్యాయి. అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కిశోరి పడ్నేకర్‌ హెచ్చరించారు…ప్రధానంగా మహారాష్ట్ర, కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఈ రెండు రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య… మొత్తం కేసుల్లో 75.87 శాతంగా ఉంది. ఈనెల 13 నుంచి మధ్యప్రదేశ్‌లో కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పంజాబ్‌లోనూ కొత్త కేసులు సడెన్‌గా పెరిగాయి. గత వారం రోజుల్లో చత్తీస్ గఢ్ లో కోవిడ్‌ తన ఉనికిని చాటుకుంటుంది. కొత్త కేసులతో పాటు… కొవిడ్ మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగానే నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో దాదాపు 75 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోనే అత్యధిక మరణాలు రికార్డవుతున్నాయి.వైరస్‌లో మార్పులు ఎలా ఉన్నా… నిబంధనలను ప్రజలు గాలికి వదిలేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వాలు అంటున్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి విషయాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అజాగ్రత్తగా ఉంటే పరిస్థితి మరింత దిగజారి, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దేశంలో కరోనా వైరస్‌ ఎన్నోరకాల మ్యుటేషన్లకు గురైందని సీసీఎంబీ ఇటీవలే ప్రకటించింది. దీనివల్ల పెను ప్రమాదమే పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు రకాల మ్యుటేషన్లు దేశాన్ని వణికిస్తున్నాయి. వచ్చే నెల రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు నిపుణులు…