బిక్షా పాత్ర చెట్టు.. అంటె ఏమిటో తెలుసుకోండి.

బిక్షా పాత్ర చెట్టు
——————————
ప్రకృతిలో వేలకొద్దీ రకాల వృక్షాలున్నాయి.

పనస చెట్టు ను పోలిన దీని శాస్త్రీయ పేరు ’క్రెసెన్సియా కుజెటె ’ [ crescentia cujete ]
కన్నడ లో ’ సోకే కాయి చెట్టు ’ అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు కానీ సామాన్యముగా భిక్షాపాత్ర చెట్టు అంటే అర్థము అవుతుంది. ఈ చెట్టు కాయలలో అనేకమైన ఔషధీయ గుణాలున్నాయి.
.
వెనుకటి కాలములో ఋషులు, మునులు, భిక్షువులు ఈ కాయ బుర్ర లను పాత్ర రూపములో వాడినందువల్ల , దీనికి ’ భిక్షాపాత్ర చెట్టు ’ అనే పేరు వచ్చింది.
.
తమిళ్ లో దీన్ని ’ తిరువట్టు కాయి ’ అంటారంట. అరణ్య ప్రదేశాలలో పెరిగే ఈ చెట్టు మూలతః అమెరికా నుండే వచ్చిందంటారు. ఇది ’ బిగ్నోనియేషియా ’ కుటుంబానికి చేరినది.
.
బాగా బలిసిన కాయను పైన కొద్దిగా బ్లేడుతో కట్ చేసి, లోపలి గుజ్జును తీసేసి, కాయను ఎండించి, పాత్రరూపములో వాడవచ్చు. ఇందులో నీరు, ఆహార పదార్థాలు వేసి ఉంచుకొంటే వాటిని సేవించడము వల్ల ఆరోగ్యానికి మంచిది .
.
చెట్టు సామాన్యముగా ఆరు నుండీ పది మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీనికొమ్మలు కింది భాగమునుండే విశాలముగా పరచుకొని వ్యాపిస్తాయి. ప్రతి కొమ్మలోనూ కాయలు, కింది స్థాయినుండే , గుత్తులుగా పెరిగి నవనవలాడుతుంటాయి.
.
ఈ కాయలు గుడ్డు ఆకారములో ఉండి, చాలా గట్టిగా ఉంటాయి.
మే- జనవరి నెలలలో ఈ చెట్టు పుష్పిస్తుంది.తెలుపు, ఆకుపచ్చ రంగుల మిశ్రమముతో ఈ పూలు చాలా ఆకర్షకముగా ఉంటాయి. కాయ బాగా బలిసిన తరువాత, లోపలి గుజ్జు బాగా గట్టిపడి, కాయ ’ బుర్ర ’ లాగా కనబడుతుంది. ఈ లేత కాయలను కొందరు కూరకు, పులుసుకు ఉపయోగిస్తారు.
.
ముఖ్యముగా ఈ కాయలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆస్తమా, పొట్టనొప్పి, జలుబు, దగ్గు, అతిసారము, శ్వాసకోశములకు సంబంధించిన రోగాలకు దీని కాయ సిద్ధముగా ఉన్న మందు వంటిది. దీని ఆకులలో రక్తపోటు [ బీపీ ] ని నివారించే ప్రభావము ఉంది. ఆయుర్వేద వైద్యుల సలహాతో వీటిని తీసుకొనుట ఉత్తమము.
చాలామంది గృహాంగణములలో దీన్ని అలంకారముగా పెంచుకుంటారు.
అన్నట్టు, వీటి కాయ బుర్రలతో సంగీత పరికరాలు కూడా తయారు చేస్తారు.