ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లోప్లేయ‌ర్స్‌కు వ‌రుస‌గా గాయాలు (ఐపీఎల్‌) కారణం అంటున్న ఆస్ట్రేలియా కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్‌.

ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో ప్లేయ‌ర్స్ వ‌రుస‌గా గాయాల పాల‌వుతుండ‌టానికి ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగే (ఐపీఎల్‌) కార‌ణ‌మ‌ని అన్నాడు ఆస్ట్రేలియా కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్‌. గ‌తేడాది ఐపీఎల్ జ‌ర‌గాల్సిన స‌మ‌యానికి కాకుండా ఆల‌స్యంగా జ‌ర‌గ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని అత‌ను అభిప్రాయ‌ప‌డ్డాడు. మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో జ‌ర‌గాల్సిన ఈ మెగా లీగ్‌.. సెప్టెంబ‌ర్ 19 నుంచి నవంబ‌ర్ 11 వ‌ర‌కూ యూఏఈలో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే టీమిండియా అటు నుంచి అటే ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అక్క‌డ 14 రోజుల పాటు మ‌రోసారి క్వారంటైన్‌లో ఉంది. లీగ్ జ‌రిగిన స‌మ‌యం వ‌ల్లే ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని లాంగ‌ర్ అన్నాడు. ఈ టూర్‌లో ఇన్ని గాయాలు కావ‌డం చాలా విచిత్రంగా ఉంది. వ‌న్డే, టీ20 సిరీస్‌ల సంద‌ర్భంగా మా ప్లేయ‌ర్స్ గాయాల పాల‌య్యారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ప్లేయ‌ర్స్‌కు అదే ప‌రిస్థితి ఎదురైంది. ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌ర‌గ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌న‌డానికి నేను ఏమాత్రం సందేహించ‌ను. ఇలాంటి పెద్ద సిరీస్‌కు ముందు ఐపీఎల్ స‌రికాదు. ఐపీఎల్ అంటే నాకూ ఇష్ట‌మే. ఇంగ్లిష్ కౌంటీ ఎలాగైతే ప్లేయ‌ర్స్‌కు ఉప‌యోగ‌ప‌డేదో.. ఇప్పుడు ఐపీఎల్ కూడా అంతే అని లాంగ‌ర్ అన్నాడు. వ‌న్డే, టీ20 సిరీస్ సంద‌ర్భంగా వార్న‌ర్‌, స్టాయినిస్‌లాంటి ప్లేయ‌ర్స్ గాయ‌ప‌డ‌గా.. టెస్ట్ సిరీస్‌లో ష‌మి, ఉమేష్‌, బుమ్రా, రాహుల్‌, జ‌డేజా, విహారి గాయాల‌పాల‌య్యారు.