రెండో టెస్టు రెండో రోజు ఆటలోఆధిక్యంలో టీమ్‌ఇండియా

ఓవర్‌నైట్‌ స్కోరు 300/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌(58 నాటౌట్‌) అర్ధసెంచరీతో మెరిశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఆది నుంచే తడబడింది. ఆతిథ్య టీమ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇంగ్లీష్‌ జట్టును 150 పరుగుల లోపే చుట్టేసింది. భారత స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడిన ఇంగ్లీష్‌ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(5/43) తన మాయాజాలాన్ని ప్రదర్శించి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. ఇషాంత్‌ శర్మ(2/22), అక్షర్‌ పటేల్‌(2/40) కట్టుదిట్టంగా బంతులేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. బెన్‌ఫోక్స్‌(42 నాటౌట్‌: 107 బంతుల్లో 4ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. రోరీ బర్న్స్‌(0), డొమినిక్‌ సిబ్లే(16), డేనియల్‌ లారెన్స్‌(9), జో రూట్‌(6), బెన్‌ స్టోక్స్‌(18), ఓలీ పోప్‌(22), మొయిన్‌ అలీ(6) ఆతిథ్య బౌలర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(25), పుజారా(7) క్రీజులో ఉన్నారు. యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌(14) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ప్రస్తుతం మ్యాచ్‌పై పట్టుసాధించిన కోహ్లీసేన 249 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.