విజయానికి చేరువలో భారత్‌…..

సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో వరుసగా మూడో రోజు భారత్ పూర్తి ఆధిపత్యం ప్ర‌ద‌ర్శించింది. రెండో టెస్టులో టీమ్‌ఇండియా గెలుపు దాదాపు ఖాయమైంది. మ్యాచ్‌లో విజయానికి భారత్ 7‌ వికెట్ల దూరంలో ఉంది. స్పిన్‌కు విపరీతంగా సహకరిస్తున్న పిచ్‌పై స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్ చెల‌రేగి‌ ఇంగ్లాండ్‌ను భారీ దెబ్బకొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ కోలుకోకుండా ఒత్తిడి పెంచారు.
టర్నింగ్‌ పిచ్‌పై ఇంగ్లాండ్‌ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే. 482 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌ సోమవారం ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం జో రూట్‌(2), డేనియల్‌ లారెన్స్‌(19) క్రీజులో ఉన్నారు. డొమినిక్‌ సిబ్లే(3), జాక్‌ లీచ్‌(0)లను అక్షర్‌ పెవిలియన్‌ పంపగా..రోరీ బర్న్స్‌(25)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 429 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు ఆట మొదటి సెషన్‌లోనే ప్రత్యర్థిని కుప్పకూల్చాలని కోహ్లీసేన భావిస్తున్నది.