టీమిండియా ఘ‌న విజ‌యం…

ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. స్పిన్ పిచ్‌పై ఇంగ్లండ్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్న‌ర్లు.. 317 ప‌రుగుల భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయ‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టామ్ స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ 5 వికెట్లు తీయ‌డం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 134 ప‌రుగుల‌కు ఆలౌటైన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో చివ‌ర్లో మెరుపులు మెరిపించిన మోయిన్ అలీ 43 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీయ‌డంతో పాటు సెంచ‌రీ చేసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప‌రుగుల ప‌రంగా టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో టీమిండియాకు ఇది ఐదో భారీ విజ‌యం కావ‌డం విశేషం. ఈ నెల 24 నుంచి అహ్మ‌దాబాద్‌లోని ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియం మొతెరాలో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ స్టేడియాన్ని పున‌ర్నిర్మించిన త‌ర్వాత తొలి టెస్ట్ ఇదే కావ‌డం విశేషం. అందులోనూ ఇది డేనైట్ టెస్ట్ అవ‌డం మ‌రింత ఆస‌క్తి రేపుతోంది.