కోహ్లీసేన 3-1తో సిరీస్‌ కైవసం…..

*ఫైనల్‌కు కోహ్లీసేన: 3-1తో సిరీస్‌ కైవసం*

*ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ ఓటమి*

సీనియర్లు లేరు. గాయాల బెడద. గులాబి టెస్టులో ఘోర పరాభవం. 36 పరుగుల్లోపే ఆలౌటైన వైనం. అయితేనేం! గట్టిగా పుంజుకున్న టీమ్‌ఇండియా ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. సగర్వంగా తలెత్తుకొని సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతులేని ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెట్టింది.

కోహ్లీ వచ్చేశాడు. రహానె స్వింగ్‌లో ఉన్నాడు. రోహిత్‌ శర్మకు తిరుగులేదు. సీనియర్‌ పేసర్లూ అందుబాటులోకి వచ్చారు. స్పిన్నర్లకు కొదవలేదు. ఇంకేముంది! ఇంగ్లాండ్‌కు క్లీన్‌స్వీప్‌ తప్పదన్న అంచనాలు. కానీ అనూహ్యంగా తొలి టెస్టులో 227 పరుగులతో టీమ్‌ఇండియాకు ఊహించని అవమానం. అవకాశం దొరికింది కదా అని మైకేల్‌ వాన్‌, పీటర్సన్‌ వంటి ఇంగ్లాండ్‌ మాజీల వ్యంగ్య విమర్శలు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరుకోవడంపై నీలి మబ్బులు.

టీమ్‌ఇండియా మాత్రం ఆత్మనిబ్బరం కోల్పోలేదు. తన అమ్ములపొదిలోని దివ్యాస్త్రం ‘స్పిన్‌’ను నమ్ముకుంది. అక్షర్‌ పటేల్‌ అరంగేట్రం చేసిన శుభవేళ.. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ అతడికి తోడైన వేళ.. రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ మెరుపు జతకూడిన సందర్భంలో అదే చెన్నైలో 317 పరుగుల తేడాతో ఆంగ్లేయులకు షాకిచ్చింది. మళ్లీ అదే స్పిన్‌ ద్వయంతోనే మొతేరాలో 10 వికెట్లతో గెలిచేసింది. అక్షర్‌, యాష్‌ వికెట్ల జడివాన కురిపించగా సుందర్‌, పంత్‌ పరుగుల పారించగా ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమి చవిచూసింది.

చివరికి విమర్శలను లెక్కచేయని టీమ్‌ఇండియా 3-1తో సిరీస్‌ కైవసం చేసుకొని లార్డ్స్‌ న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఒక టెస్టులో ఓటమిపాలైనా సిరీసులు గెలవగలమని చాటిచెప్పింది. భారత యువ ప్రతిభను ప్రపంచానికి చూపించింది. సొంతగడ్డపై వరుసగా 13వ సిరీస్‌ సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. తిరుగులేని ఆనందం.. అంతులేని ఆత్మవిశ్వాసంతో పొట్టి క్రికెట్‌ సిరీసులకు సిద్ధమవుతోంది.

*మొతేరా మోత*

మొతేరాను టీమ్‌ఇండియా మోతెక్కించింది. అక్షర్‌ పటేల్‌ (5/48), అశ్విన్‌ (5/47) ఐదు వికెట్లతో వణికించిన వేళ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. కోహ్లీసేన 365 పరుగులకు ఆలౌటవ్వడంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన జోరూట్‌ సేన‌ 135 పరుగులకే చాపచుట్టేసింది. స్పిన్‌ ద్వయం గింగిరాల బంతులను ఆడలేక టీమ్‌ఇండియా ఆధిక్యమైన 160 పరుగులనూ సమం చేయలేకపోయింది. ఆంగ్లేయుల్లో డేనియెల్‌ లారెన్స్‌ (50; 95 బంతుల్లో 6×4) ఒక్కడే ఆఖరి వరకు పోరాడాడు.

*సుందరమైన ఇన్నింగ్స్‌*

ఓవర్‌నైట్ ‌స్కోరు 294/7తో మూడోరోజు, శనివారం ఆట మొదలు పెట్టిన టీమ్‌ఇండియాకు వాషింగ్టన్‌ సుందర్‌ (96*; 174 బంతుల్లో 10×4, 1×6), అక్షర్‌ పటేల్‌ (43; 97 బంతుల్లో 5×4, 1×6) శుభారంభం అందించారు. ఆచితూచి ఆడుతూనే బౌండరీలు సాధించారు. వీరిద్దరూ ఎంతో శ్రద్ధగా పరుగులు చేశారు. ఎనిమిదో వికెట్‌కు 113 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరును 365కు చేర్చారు. 114 ఓవర్లో అక్షర్‌ రనౌట్‌ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. అదే స్కోరు వద్ద ఇషాంత్‌, సిరాజ్‌ డకౌట్‌ కావడంతో సుందర్‌ శతకం చేయలేకపోయాడు. అయితే జట్టుకు 160 పరుగుల విలువైన ఆధిక్యాన్ని అందించాడు.

*స్పిన్‌ ద్వయం మాయ*

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు అక్షర్‌, అశ్విన్‌ ఊపిరాడనివ్వలేదు. జట్టు స్కోరు 10 వద్దే జాక్‌ క్రాలీని యాష్‌, సిబ్లీని అక్షర్‌ పెవిలియన్‌ పంపించారు. 20 వద్ద సిబ్లీని, 30 వద్ద బెన్‌స్టోక్స్‌ను అక్షరే ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో జోరూట్‌ (30; 72 బంతుల్లో 3×4) కాసేపు ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ జట్టు స్కోరు 65 వద్ద రూట్‌ను యాష్‌, పోప్‌ (15)ను అక్షర్‌ పెవిలియన్‌కు సాగనంపారు. దాంతో ఇంగ్లాండ్‌ ఓటమి మూడోరోజే ఖరారైపోయింది. భోజన విరామం తర్వాత బెన్‌ఫోక్స్‌ (13), డామ్‌ బెస్‌ (2), జాక్‌ లీచ్‌ (1)తో లారెన్స్‌ ఆఖరి వరకు పోరాడాడు. జట్టుకు గౌరవ ప్రదమైన ఓటమి అందించాలని తపన పడ్డాడు. కానీ అతడి ఆటల్ని భారత స్పిన్‌ ద్వయం సాగనివ్వలేదు. ఓ అద్భుతమైన బంతికి అర్ధశతకం చేసిన లారెన్స్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో అశ్విన్‌ ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను 135కు ముగించేశాడు. తన కెరీర్లో 30వ సారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. అక్షర్ ‌సైతం ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం. సిరీసులో మొత్తంగా 27 వికెట్లు తీయడం ప్రత్యేకం.

*ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 205*
*భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 365*
*ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 135*