తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌ను..రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ను చిత్తు చేసినా భారత్ .…

టీమిండియా అదరగొట్టింది. ఇప్పటికే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్ (1), ఫించ్ (8) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ కూడా డకౌట్‌గా వెనుతిరిగాడు. అనంతరం స్టీవ్ స్మిత్ 57, మ్యాక్స్‌వెల్ 37, స్టాయినీస్ 41 పరుగులతో రాణించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా… రాహుల్ చాహర్, భువనేశ్వర్. రవీంద్ర జడేజా చెరొక వికెట్ సాధించారు..అనంతరం 153 పరుగుల విజయలక్ష్యంతో బరిలోగి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషాన్ తీసుకున్న బాధ్యతను ఈ మ్యాచ్‌లో రోహిత్ చేపట్టాడు. ఆసీస్ బౌలర్లను అతడు చీల్చి చెండాడాడు. జట్టు స్కోరు 68 పరుగుల వద్ద రాహుల్ 39 పరుగులు చేసి అగార్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్‌తో రోహిత్ రెచ్చిపోయి ఆడాడు. మొత్తం 41 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసిన రోహిత్ రిటైర్డ్ ఔట్ అయ్యాడు. సూర్యకుమార్ (38), హార్డిక్ పాండ్యా (14) పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఈనెల 24న పాకిస్థాన్‌తో పోరుతో భారత్ తన వేట ప్రారంభించనుంది..