షమీ పై సోషల్‌ మీడియాలో విమర్శలు…

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘోర పరాజయంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. షమీ లక్ష్యంగా సోషల్‌ మీడియాతో జరిగిన దాడిని భారత క్రికెటర్లు, పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు. సచిన్‌ టెండూల్కర్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ తదితరులు షమీకి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా షమీకి మద్దతు తెలిపారు. ‘భారత జట్టుతో పాటు జట్టులోని సభ్యులకు మేం మద్దతుగా ఉంటాం. షమీ నిబద్ధత గల వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌. షమీకి, భారత జట్టుకు అండగా నిలబడతాం’అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ‘ఆన్‌లైన్‌లో షమీపై దాడి షాక్‌కు గురి చేసింది. అతడికి అండగా నిలబడతాం. అతడో ఛాంపియన్‌. షమీ తర్వాతి మ్యాచ్‌లో నీ సత్తా చూపించు’అని సెహ్వాగ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.‘మేం నిన్ను ప్రేమిస్తున్నాం’అని హర్భజన్‌ ట్వీట్‌ చేశాడు.