కివీస్‌ ఘన విజయం.. సెమీస్‌ రేస్ కై మరో అడుగు…!

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. నమీబియాపై ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్‌-2లో సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. పాకిస్థాన్‌ (8 పాయింట్లు) ఇప్పటికే సెమీస్‌కు చేరుకోగా.. కివీస్‌ (6 పాయింట్లు), అఫ్గానిస్థాన్‌ (4 పాయింట్లు) రెండో సెమీస్‌ బెర్తు కోసం ముందు వరుసలో ఉన్నాయి. కివీస్ తన ఆఖరి మ్యాచ్‌ను అఫ్గాన్‌తోనే నవంబర్ 8న తలపడనుంది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లిపోతుంది. భారత్‌, ఆఫ్గాన్‌ ఇంటిముఖం పట్టక తప్పదు. ఒకవేళ అఫ్గాన్ విజయం సాధిస్తే నెట్‌ రన్‌రేట్‌ కీలకం కానుంది. భారత్‌ తన రెండు మ్యాచుల్లోనూ (నవంబర్ 5 స్కాట్లాండ్‌పై, నవంబర్ 8న నమీబియాపై) గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై సెమీస్‌ భవితవ్యం ఆధారపడి ఉంది.

షార్జా వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు స్టీఫెన్‌ బార్డ్‌ (21: రెండు ఫోర్లు), మైకెల్ వాన్‌ లింగెన్‌ (25: రెండు ఫోర్లు, ఒక సిక్స్‌) నిలకడగా ఆడుతూ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరితోపాటు కెప్టెన్‌ ఎరాస్మస్‌ (3) ఔట్‌ కావడం నమీబియాను దెబ్బతీసింది. అనంతరం వచ్చిన గ్రీన్‌ (23)తో కలిసి డేవిడ్ వైజ్‌ (16) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఛేదించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడంతో దూకుడుగా ఆడే క్రమంలో కివీస్‌ బౌలర్‌ సౌథీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే నమీబియా ఓటమి ఖాయమైపోయింది. జేజే స్మిత్ 9*, రుబెన్ 6* నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌథీ 2.. సాట్నర్, నీషమ్‌, సోధి తలో వికెట్ తీశారు. .

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు చేసిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు గప్తిల్ (18), మిచెల్‌ (19) దూకుడును నమీబియా బౌలర్లు అడ్డుకోగలిగారు. అయితే తర్వాత వచ్చిన విలియమ్సన్‌ (28) ఫర్వాలేదనిపించినా.. కీలక సమయంలో ఔటైపోయాడు. కాన్వే (17) ఎక్కువ సేపు నిలవలేదు. అప్పటి వరకు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన నమీబియా బౌలర్లు చివర్లో పట్టు సడలించారు. దీంతో ఆఖర్లో కివీస్‌ బ్యాటర్లు గ్లెన్‌ ఫిలిప్స్‌ (39*), నీషమ్‌ (35*) చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి ఆరు ఓవర్లలో 76 పరుగులు రాబట్టారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అనుకున్న కివీస్‌ మంచి లక్ష్యాన్నే ప్రత్యర్థి ఎదుట ఉంచింది. నమీబియా బౌలర్లలో స్కాల్జ్‌, వైజ్‌, ఎరాస్మస్‌ తలో వికెట్‌ పడగొట్టారు..