యూరోప్ దేశం స్పెయిన్‌లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన వెలుగుచూసింది. 28 ఏళ్ల ఓ యువకుడు కన్నతల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే గాక… ఆమె శరీర భాగాలను తినేశాడు. తల్లితో ఓ విషయంలో తలెత్తిన గొడవ తీవ్ర వాగ్వాదానికి దారితీయడంతో కోపోద్రిక్తుడైన అతను విచక్షణారహితంగా ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆపై ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో పెట్టి నెలల తరబడి వాటిని భుజించాడు. 2019లో ఈ ఘటన జరగ్గా… తాజాగా స్పానిష్ కోర్టు నిందితుడికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. స్పెయిన్‌లోని లాస్ వెంటాస్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో మరియా సోలెదాద్ గోమెజ్ అనే మహిళ,ఆమె కొడుకు అల్బర్టో సాంచెజ్ గోమెజ్(28) చాలాకాలంగా నివసిస్తున్నారు. ఫిబ్రవరి,2019లో ఓరోజు తల్లీకొడుకుల మధ్య ఏదో విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన సాంచెజ్ గోమెజ్ తన తల్లిపై దాడి చేశాడు. రంపంతో పాటు కిచెన్‌లోని రెండు కత్తులతో విచక్షణారహితంగా ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆపై ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి కొన్నింటిని ప్లాస్టిక్ బ్యాగులో నింపి చెత్త బుట్టలో పడేశాడు. మిగతా వాటిని ఇంట్లోని ఫ్రిజ్‌లో స్టోర్ చేశాడు. ఆ తర్వాత దాదాపు 15 రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆ శరీర భాగాలను రోజుకు కొంత చొప్పున తినేశాడు. ఈ సమాచారం పోలీసులకు ఎలా చేరిందో తెలియదు గానీ మొత్తానికి ఒకరోజు ఆ ఇంటిపై వారు దాడులు చేశారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన శరీర భాగాలను చూసి షాక్ తిన్నారు.గోమెజ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో గోమెజ్ నేరం అంగీకరించాడు. తన తల్లి తన జీవితాన్ని అత్యంత సంక్లిష్టంగా మార్చివేసిందని… అందుకే ఆమెను హత్య చేయాల్సి వచ్చిందని పోలీసులతో అతను వెల్లడించాడు…
ఏప్రిల్,2019లో ఈ కేసుకు సంబంధించి మాడ్రిడ్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. కోర్టులో నిందితుడు గోమెజ్‌ను ప్రవేశపెట్టగా… హత్య చేసిన సమయంలో ఆమెను చంపేయాల్సిందిగా తనకు కొన్ని గొంతులు వినిపించాయని అతను పేర్కొనడం గమనార్హం. కొన్నేళ్లుగా తాను మానసిక సమస్యలతో సతమతమవుతున్నానని.. మద్యపానం, ధూమపానం వ్యసనంగా మారిందని చెప్పాడు. దాదాపు రెండేళ్ల విచారణ తర్వాత మాడ్రిడ్ కోర్టు ఈ కేసులో ఇటీవల తుది తీర్పు వెలువరించింది.తల్లిని హత్య చేసినందుకు 15 ఏళ్లు, ఆమె శరీర భాగాలను తిన్నందుకు మరో 5 నెలల జైలు శిక్ష విధించింది. అతనిలో ఎలాంటి భావోద్వేగాలు లేవు…ఈ కేసుపై పోలీసులు మాట్లాడుతూ… తాము గోమెజ్ ఇంటిపై దాడులు చేసినప్పుడు గానీ,అతన్ని విచారించినప్పుడు గానీ… అతనిలో ఎటువంటి హావభావాలు,భావోద్వేగాలు కనిపించలేదని చెప్పారు. గోమెజ్ తన తల్లిపై మొదట వెనుక నుంచి దాడి చేశాడని… ఆపై పదునైన వస్తువులతో హత్య చేశాడని తెలిపారు. నిందితుడు గోమెజ్‌ను స్పానిష్ మీడియా ‘లాస్ వెంతాస్ నరభక్షకుడు’గా అభివర్ణించింది. డిసెంబర్,2018లో దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కూడా నరమాంస భక్షణ కేసులో జీవిత ఖైదు పడింది.