మానవ మృగానికి సరైన శిక్ష..!

2020 అక్టోబరు 18న మహబూబాబాద్‌ పట్టణంలో అద్దె ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కుసుమ దీక్షిత్‌రెడ్డి అనే బాలుడి అపహరణ, ఆపై హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని బృందాలుగా ఏర్పడి విచారించారు. సాంకేతికతను ఉపయోగించుకుని నాలుగు రోజుల్లో నిందితుడిని పట్టుకున్నారు. బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేసింది బాధితుల సొంతూరిలో ఇంటి పక్కనే ఉండే మంద సాగర్‌ అని తెలిసి అంతా నివ్వెరపోయారు. మానవ మృగానికి సరైన శిక్ష పడిందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2020 అక్టోబరు 18 (ఆదివారం): సాయంత్రం 5 గంటలకు దీక్షిత్‌రెడ్డిని బైక్‌ మెకానిక్‌ మంద సాగర్‌ అపహరించాడు.
రాత్రి 9.15 గంటలకు దీక్షిత్‌రెడ్డి తల్లి వసంతకు ఇంటర్నెట్‌ కాల్‌ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.
9.30 గంటలకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాలుడి తండ్రి రంజిత్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్పీ కోటిరెడ్డి పోలీసు బృందాలతో పట్టణంలో విస్తృతంగా గాలింపు చేపట్టారు.
2020 అక్టోబరు 19: కిడ్నాపర్‌ ఉదయం 8.33 గంటలకు మరోసారి వసంతకు ఫోన్‌ చేసి డబ్బులు అడిగాడు.
మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్‌ చేశాడు.
యాప్‌ ద్వారా వస్తున్న కాల్‌ను ఛేదించడానికి హైదరాబాద్‌ నుంచి సైబర్‌క్రైం బృందం సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్‌కు చేరుకుంది.
2020 అక్టోబరు 20: దీక్షిత్‌రెడ్డి తండ్రి రంజిత్‌రెడ్డి పోలీసులకు చెప్పిన కొంతమంది అనుమానితులను అప్పటి ఎస్పీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌క్రైం బృందం వచ్చి విచారణ చేపట్టింది.
రాత్రి 8 గంటలకు కిడ్నాపర్‌ సాగర్‌ దీక్షిత్‌రెడ్డి తల్లి వసంతకు ఫోన్‌ చేసి డబ్బులు సిద్ధం చేయండి బుధవారం ఉదయం ఫోన్‌ చేస్తానని చెప్పి కట్‌ చేశాడు.
2020 అక్టోబరు 21: ఉదయం 11 గంటలకు కిడ్నాపర్‌ సాగర్‌ వసంతకు ఫోన్‌ చేసి డబ్బులు సిద్ధంగా ఉన్నాయా.. వాటిని పట్టణంలోని మూడు కొట్ల ప్రాంతానికి తీసుకుని రావాలని సూచించడంతో 11.05 గంటలకు టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టణంలో గాలింపు చేపట్టింది.
మధ్యాహ్నం ఒంటి గంటకు రంజిత్‌రెడ్డి డబ్బులతో కూడిన బ్యాగ్‌ను తీసుకుని మూడు కొట్ల ప్రాంతానికి వెళ్లాడు.
రాత్రి 9 గంటల తర్వాత రంజిత్‌రెడ్డి అక్కడి నుంచి తాళ్లపూసపల్లి రహదారి వైపు వెళ్లాడు.
2020 అక్టోబరు 22: తెల్లవారు జామున 2.30 గంటలకు కిడ్నాపర్‌ మంద సాగర్‌ను పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం 11 గంటలకు అప్పటి ఎస్పీ కోటిరెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించి దీక్షిత్‌రెడ్డిని సాగర్‌ హత్యచేశాడని వెల్లడించారు.
2021 జున్‌ 28న అప్పటి పట్టణ సీఐ సుంకరి రవికుమార్‌ 650 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.
2023 సెప్టెంబరు 29న కోర్టులో పోక్సో పీపీ పద్మాకర్‌రావు వాదనలు వినిపించారు. జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్‌ నిందితుడు మంద సాగర్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.కేసును సవాలుగా తీసుకున్న అప్పటి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మొత్తం 100 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని 10 బృందాలుగా ఏర్పాటు చేశారు. వీరే కాకుండా ఇంటలిజెన్స్‌ను రెండు బృందాలుగా, ఎస్‌బీ రెండు బృందాలుగా, ఐటీకోర్‌ బృందంగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఇంటర్నెట్‌ కాల్‌ను ఛేదించడానికి హైదరాబాద్‌ నుంచి నలుగురితో కూడిన సైబర్‌ క్రైం బృందాన్ని రప్పించారు. వరంగల్‌ కమిషనరేట్‌ నుంచి 10 మందితో కూడిన టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌ క్రైం బృందాన్ని కూడా పిలిపించారు. వీరంతా కలిసి పట్టణంలో విస్తృతంగా సోదాలు చేస్తూ పట్టణంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసు ఛేదనకు నాలుగు రోజుల సమయం పట్టింది.

క్షీరాభిషేకం: తీర్పును హర్షిస్తూ దీక్షిత్‌ రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలిలో న్యాయ వ్యవస్థ, పోలీస్‌ చిహ్నలు, తమ కుమారుడి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి దానికి క్షీరాభిషేకం చేశారు. పట్టణవాసులు ముత్యాలమ్మ సెంటర్‌, పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు.

న్యాయం గెలిచింది

కుసుమ రంజిత్‌రెడ్డి-వసంత దంపతులు

ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనడానికి ఇది నిదర్శనం. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి, వాదనలు వినిపించిన న్యాయవాదులకు, పోలీసులకు రుణపడి ఉంటాం. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.

ఇప్పటి వరకు ఎనిమిది మందికి ..

బాలుడు దీక్షత్‌రెడ్డి హత్యకేసులో దోషి మంద సాగర్‌కు ఉరిశిక్ష విధించడంతో ఉమ్మడి జిల్లాలో వీరి సంఖ్య ఎనిమిదికి చేరింది. మానుకోట జిల్లాలో మరణ దండన తీర్పు ఇదే మొదటిది.

మరణ శిక్ష పడుతుందని అనుకోలేదు

మంద రామచంద్రు, నిందితుడి తండ్రి

శిక్ష పడుతుందని అనుకున్నాను. కాని మరణ శిక్షణ అనుకోలేదు. ఈ విషయంపై ఏం మాట్లాడలేను.

నేరం చేస్తే శిక్ష తప్పదని రుజువైంది

చిలకమారి వెంకటేశ్వర్లు, కోర్టు పీపీ

పోలీసుల సహకారంతో నిందితుడికి శిక్ష పడేలా వాదించడం గర్వంగా ఉంది. బాలుడి తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. మహబూబాబాద్‌ జిల్లాలో ఇలాంటి తీర్పు ప్రథమం. దీంతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం కలుగుతుంది. నేరం చేసిన వారికి శిక్ష పడుతుందనడానికి ఈ తీర్పు ద్వారా వెల్లడైంది.

సంతోషంగా ఉంది

బి. సంపత్‌రెడ్డి, కోర్టు డ్యూటీ అధికారి

జిల్లా పోలీస్‌ అధికారుల సూచనలు, సలహాల మేరకు సాక్షులను ప్రవేశపెట్టాం. ఈ తీర్పుతో బాలుడి తల్లిదండ్రులకు న్యాయం జరగడం సంతోషాన్ని కలిగిస్తుంది.

తీర్పును స్వాగతిస్తున్నాం

నంద్యాల కోటిరెడ్డి, ప్రస్తుత వికారాబాద్‌ ఎస్పీ

నిందితుడు డింగ్‌ యాప్‌ను వినియోగించి దొరకకుండా ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. జిల్లా, వరంగల్‌ కమిషనరేట్‌, హైదరాబాద్‌ పోలీస్‌ బృందాలు కలిసి సాంకేతికను వినియోగించి నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నాం. ఇప్పుడు కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం స్వాగతిస్తున్నాం…