పునర్జన్మలపై మితిమీరిన విశ్వాసమే అలేఖ్య, సాయిదివ్యల హత్యకు కారణమా?..

చిత్తూరు జిల్లా, మదనపల్లెలో జరిగిన దారుణ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా.. మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులే ఇద్దరు కూతుళ్లను దారుణంగా కడతేర్చారు. ఈ జంట హత్యల కేసులో రోజుకొక నమ్మలేని నిజం వెలుగులోకి వస్తోంది. హత్యకు ముందు మల్లూరు పురుషోత్తం నాయుడు, పద్మజ కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్య ఇన్‌స్టాలో చేసిన పోస్టులు అనుమానాలకు తావివ్వగా దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు….
మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులే ఇద్దరు కూతుళ్లను దారుణంగా కడతేర్చిన జంట హత్యల కేసులో రోజుకొక నమ్మలేని నిజం వెలుగులోకి వస్తోంది.పునర్జన్మలపై మితిమీరిన విశ్వాసమే అలేఖ్య, సాయిదివ్యల హత్యకు కారణమా? అన్న ప్రశ్నకు అవునన్న సమాధానమే వస్తోంది. మరణించిన వారు తిరిగి బతికొస్తారన్న అలౌఖ్య గుడ్డి నమ్మకమే.. వారిని విచక్షణ కోల్పోయేలా చేసిందని అంటున్నారు పోలీసులు ..సత్యలోకం వస్తుందనే భ్రమలో ఉన్న లోకానికి దూరంగా ఆలోచించేలా చేయడానికి పెద్ద కూతురే కారణమనే వాదన బలంగా వినిపడుతోంది.
చదువులో మెరిట్ స్టూడెంట్ అయిన అలేఖ్య.. చిన్నచిన్న మ్యాజిక్‌ లు చేసి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసేది. ఇవి చూసి తల్లిదండ్రులు పొంగిపోయేవారు. తమ కూతురికి నిజంగానే శక్తులు ఉన్నాయని నమ్మడం ప్రారంభించారు. ఇక, తమ ఇద్దరు కూతుళ్లు సాక్షాత్తు శివుడు, పార్వతులని పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు పోలీసులకు చెప్పారట. ఈ తరుణంలో రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్లిన చిన్నకూతురు సాయి దివ్య, బయట ఏదో ముగ్గు మధ్యలో ఉన్న నిమ్మకాయ తొక్కినట్లు అనుమానపడింది. అప్పటి నుంచి తాను చనిపోతానంటూ భయంతో ఏడుస్తూ ఉండేది…తాను చనిపోతాను ఎమో అని అంటే…అవునవును నువ్వు చనిపోతావని అలేఖ్య చెప్పేది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 23వ తేదీన భూత వైద్యుడుతో తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ దివ్యకు తాయెత్తులు కట్టించారు. అయినా ఈ నెల 24న మధ్యాహ్నం దివ్య తాను చనిపోతానంటూ ఏడుస్తూ ఇంట్లో మేడపైన ఉన్న తన గదిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు, అలేఖ్య మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గదిలోకి వెళ్లి దివ్యకు వేపాకు మండలతో మంత్రాలు చేశారు. దీంతో దివ్య ఇంకా గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో దివ్యను చంపేయాలని.. తాను బతికిస్తానని అలేఖ్య నమ్మబలికినట్లుగా చెబుతున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రులు డంబెల్‌తో తలపై మోది చంపేశారు. ఇది జరిగిన నాలుగు గంటల తర్వాత, అంటే సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను చంపినట్లుగానే తనను కూడా చంపెయ్యాలని అలేఖ్య తల్లిదండ్రులను కోరింది. తాను కూడా చనిపోయి చెల్లి దివ్యను తిరిగి తీసుకొస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని.. పెంపుడు కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య నమ్మబలికింది. ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ పూర్తిగా నమ్మేశారు. తర్వాత పూజ గదిలోకి వెళ్లిన అలేఖ్య గుండు కొట్టుకుని, బట్టలన్నీ విప్పేసి.. ఒక చీర వంటి బట్టను ధరించింది. అనంతరం నవ ధాన్యాలు పోసిన రాగి చెంబును నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలేఖ్యను దివ్య మాదిరిగానే డంబెల్స్‌తో కొట్టి తల్లిదండ్రులు చంపారు. ఇలా, చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలేఖ్య.. చనిపోయిన దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో హతమైంది. పునర్జన్మలపై విశ్వాసమే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు