బీఫార్మసీ విద్యార్థిని అత్యాచారంలో కొత్త కోణం

బీఫార్మసీ విద్యార్థిని అత్యాచారంలో కొత్త కోణం

ఘట్‌కేసర్‌ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో నాటకీయ పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.

కేసుకు సంబంధించి యువతిని ప్రశ్నించడంతో కొత్త కోణం వెలుగు చూసింది. తనను అపహరించి, అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు వెల్లడైంది. తాజా సమాచారం ప్రకారం.. యువతి ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ ద్విచక్ర వాహనంపై తన ప్రియుడితో కలిసి వెళ్లింది. ఆ తర్వాత అతని ఇద్దరు సోదరులతో కలిసి గంజాయి సేవించింది.ఆమె అనుమతితోనే వారంతా ఏకాంతంగా గడిపినట్లు తెలుస్తోంది.

తల్లి తరచూ ఫోన్ చేస్తుండటంతో ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని చెప్పింది. దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో సైరన్లు వినిపించడంతో.. భయపడిన యువకులు ఆమెను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు. దీంతో గస్తీ కాస్తున్న పోలీసులకు యువతి తారసపడింది. మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.అనంతరం యువతిని ప్రశ్నించగా.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.
స్నేహితులతో కలిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లానని యువతి ఒప్పుకొన్నట్లు సమాచారం.