వ్యక్తి మృతికి కారణం అయిన ..కోడి అరెస్ట్…

*కోడి అరెస్ట్*
జగిత్యాల జిల్లా: ఓ వ్యక్తి మృతికి కోడి కారణమైంది. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని సతీష్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఎవరిని అరెస్టు చేయాలి? ఇంకేం ఆలోచనలేకుండా పోలీసులు కోడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ఏ1 కోడి రాజాను స్టేషన్‌లో కట్టేశారు. కాసేపు సెల్‌లో, మరికేసేపు చెట్టుకిందకు మార్చేస్తున్నారు. ఇక స్వేచ్ఛను కోల్పోయిన కోడిపుంజు.. తన కూతలతో పోలీస్ స్టేషన్‌ను హోరెత్తిస్తోంది.

*అసలు కథ ఏంటంటే*
జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు. తొత్తునూరులో తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు. కోడిని పందెంలో దించే సమయంలో కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన కోడిపుంజును సతీష్ గట్టిగా పట్టుకోవడంతో కాలికి అమర్చిన కత్తి సతీష్ పొట్టలో గుచ్చుకుంది. దీంతో బాధితుడిని జిగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలోనే మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వ్యక్తి మరణానికి కారణమైన కోడిని తీసుకొచ్చి స్టేషన్‌లో కట్టేశారు. కోడి పందేలు ఆడినవారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా సతీష్ మరణానికి కోడే కారణమని దాన్ని ఏ1 ముద్దాయిగా చేర్చారు. త్వరలో కోర్టులో కోడిని ప్రవేశపెట్టనున్నారు. అప్పటి వరకు కోడిని కంటికిరెప్పలా చూసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. దానికి తిండి.. నీరు పెడుతున్నారు.