అత్తారింట్లో భార్య‌ను ఎవ‌రు కొట్టినా భ‌ర్త‌దే బాధ్య‌త: సుప్రీంకోర్టు…

అత్తారింట్లో భార్య‌ను ఎవ‌రు కొట్టినా భ‌ర్త‌దే బాధ్య‌త: సుప్రీంకోర్టు…

అత్తారింట్లో కుటుంబ స‌భ్యులు, బంధువులు కొట్ట‌డం వ‌ల్ల భార్య‌కు గాయాలైనా దానికి భ‌ర్త‌దే బాధ్య‌త అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పంజాబ్‌కు చెందిన ఓ వ్య‌క్తి వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువ‌రించింది. త‌న భార్యకు త‌గిలిన గాయాల‌కు తాను కార‌ణం కాద‌ని, త‌న తండ్రి వ‌ల్లే అలా జ‌రిగింద‌ని, త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ముంద‌స్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆ వ్య‌క్తి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు.
అయితే కోర్టు మాత్రం అత‌ని వాద‌న‌ను తోసిపుచ్చింది. అత్తారింట్లో త‌న బంధువుల వ‌ల్ల భార్య‌కు గాయాలు త‌గిలినా కూడా అందుకు ప్ర‌ధాన‌ బాధ్య‌త మాత్రం భ‌ర్త‌దే అని అత్యున్న‌త న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. అత‌ని ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కొట్టేసింది.
నువ్వేం మ‌నిషివి..?
గ‌తేడాది జూన్‌లో లుధియానాకు చెందిన ఓ మ‌హిళ త‌న‌ను భ‌ర్త స‌హా అత్తింటి వారు హింసిస్తున్నార‌ని, తీవ్రంగా కొట్టార‌ని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీనిపై త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా కాపాడాలంటూ ఆ భ‌ర్త పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టుకు వెళ్లగా అక్క‌డ చుక్కెదురవ‌డంతో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు. విచార‌ణ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధ‌ర్మాస‌నం ఆ భ‌ర్త‌పై తీవ్రంగా మండిప‌డింది.
నువ్వేం మ‌నిషివి..? త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని నీ భార్య చెబుతోంది. మీరు కొట్ట‌డం వ‌ల్ల తన‌కు గ‌ర్భ‌స్రావం అయింద‌ని చెప్పింది. భార్య‌ను క్రికెట్ బ్యాట్‌తో కొడ‌తావా..? నువ్వేం మ‌నిషివి అని ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.