12 లక్షలకు రెండు కిలోల బంగారం….చివరకు ఊహించని ట్విస్ట్..

రూ”12 లక్షలకు రెండు కిలోల బంగారం..చివరకు ఊహించని ట్విస్ట్..

*r9telugunews.com..హన్మకొండ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ బంగారాన్ని విక్రయించిన ఇద్దరిని ఇంతేజార్‌గంజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ముఠా సభ్యుల నుంచి రూ. 10 లక్షల 45 వేల నగదుతో పాటు, ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ బంగారు గుండ్ల హారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కర్ణాటకకు చెందిన మోహన్‌లాల్ వరమర్, సోలంకి ధర్మ ఉన్నారు. అరెస్టుకు సంబంధించి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.

*సీపీ తరుణ్ జోషీ తెలిపిన వివరాల ప్రకారం..*

అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన మోహన్‌లాల్ పాత బట్టలను కొనుగోలు చేసి వాటిని కొత్తవాటిగా మార్చి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్మేవారు. ఈ విధంగా నిర్వహించే వ్యాపారం ద్వారా వచ్చే అదాయంతో నిందితుడు మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవాడు. గత సంవత్సరం కరోనా కారణంగా బట్టల వ్యాపారం నడవలేదు. దీంతో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తన బంధువైన.. మరో నిందితుడు ధర్మతో కలిసి తక్కువ ధరకు బంగారం అనే కాన్సె్ప్ట్‌తో నయా మోసానికి తెరలేపారు.

ఇందులో భాగంగా నిందితులు రెండు కిలోల రోల్డ్ గోల్డ్ గుండ్ల హారాన్ని కొనుగోలు చేశారు. గత అక్టోబర్ 23వ తేదీన బెంగళూర్ నుండి వరంగల్‌కు చేరుకున్న నిందితులు ఏనమామూల మార్కెట్ ప్రాంతంలో పురుగుల మందుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దుకాణం యజమానితో పరిచయం చేసుకున్నారు. మరుసటి రోజు వచ్చి మేము రోడ్డు మరమ్మత్తులు నిర్వహిస్తుండగా బంగారు గుండ్ల హారం దొరికిందని.. మా చెల్లెలు పెళ్ళి వుందని చెప్పుకొచ్చారు. ఆ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని షాపు యజమానిని నమ్మించారు.

చివరకు తమ సెల్ ఫోన్ నంబర్ తెలియజేసి నిందితులు మరుసటి రోజున ఖమ్మంకు వెళ్ళిపోయారు. దీంతో వారి మాటలు నమ్మి భార్యతో కలిసి ఖమ్మం వెళ్లిన వ్యాపారి రూ. 12 లక్షలు ఇచ్చి 2 కిలోల నకిలీ బంగారం కొన్నాడు. చివరకు ఓ స్వర్ణకారుడి ఇంటికి తీసుకొచ్చి పరీక్షించగా అది బంగారం కాదని తేలింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోసారి ఖమ్మం నుంచి వరంగల్‌కు నిందితులు వస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ప్లాన్ ప్రకారం మంగళవారం వారిని పట్టుకున్నట్టు సీపీ వెల్లడించారు…… ఇలాంటి వారిని నమ్మి అతి తక్కువ రేటుకే బంగారాలు వస్తున్నాయని మోసపోవద్దని ప్రజలకు తెలియజేశారు..