ఏపీలో విషాదం..కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి..

R9telugunews.com. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లొదొడ్డిలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. తొలుత బుధవారం ఉదయం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు కల్లు తాగడానికి వెళ్లారు. అయితే వారు కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి ఇద్దరిని తరలించగా.. అక్కడ ఇద్దరూ మృతిచెందారు. మిగతా ముగ్గురిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారు కూడా చికిత్స పొందుతూ మరణించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్ సేకరించి విచారణ చేపట్టారు. మృతులు గంగరాజు, లోవరాజు, సన్యాసయ్య, సుగ్రీవు, ఏసుబాబుగా పోలీసులు గుర్తించారు. అయితే ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు కల్తీ కల్లు తాగి మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.