చాకొలెట్లు తిని నలుగురు బాలల మృతి…

ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషీ నగర్ జిల్లాలో బుధవారం అత్యంత విషాదకర సంఘటన జరిగింది. విషపూరిత చాకొలెట్లను తిన్న నలుగురు బాలలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు తోబుట్టువులు కావడంతో అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాశ్య ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు…ప్రాణాలు కోల్పోయిన బాలల కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

స్థానికుల కథనం ప్రకారం, విషపూరితమైన చాకొలెట్లను తిన్న నలుగురు బాలలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మంజన (5), స్వీటీ (3), సమర్ (2) తోబుట్టువులు. వీరితోపాటు అరుణ్ (5) కూడా మరణించాడు. ఖుషీ నగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వరుణ్ కుమార్ పాండే తెలిపిన వివరాల ప్రకారం, దిలీప్ నగర్‌లో నివసిస్తున్న ముఖియా దేవి బుధవారం ఉదయం తన ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో ఓ ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. దానిలో ఐదు చాకొలెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. ఆ చాకొలెట్లను తన ముగ్గురు మనుమలకు, పొరుగింట్లో నివసిస్తున్న అరుణ్‌కు ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత నలుగురు బాలలు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ వారు అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు. మిగిలిన చాకొలెట్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం భద్రపరిచారు..