కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని నమ్మించి..ఏకంగా భర్తనే బలి ఇచ్చింది.

పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. ఆమె మనసు మరోకరిని కోరుకుంది. భర్త చాటుగా ప్రియుడితో సరసాలకు తెరలేపింది. తమ కార్యాలకు అడ్డుగా ఉన్నాడని భర్తను మట్టుపెట్టాలనుకుంది. కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని నమ్మించి.. ఏకంగా భర్తనే బలి ఇచ్చింది.వనపర్తి జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన.. మూడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.

వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన బాలస్వామికి , కాగజ్ నగర్‎కు చెందిన లావణ్యతో పదేండ్ల కింద పెళ్లైంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. బాలస్వామి మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. గాంధీనగర్‎లో నివాసం ఉంటున్నాడు. కాగా.. మదనపూర్‎కు చెందిన నవీన్ డ్రైవర్. ఆయన గాంధీనగర్‎లో తన స్నేహితులతో కలిసి ఉండేవాడు. ఎలాగో లావణ్యకు, నవీన్‎కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత ఎక్కువై.. భర్తను వదిలించుకోవాలని లావణ్య భావించింది. ఈ సమయంలోనే బాలస్వామి తన పొలాన్ని అమ్మాడు. అలా వచ్చిన రూ. 30 లక్షల మీద లావణ్య కన్ను పడింది. ఆ డబ్బు తీసుకొని నవీన్‎తో బతకాలనుకుంది. ఈ క్రమంలో ఓ దుర్మార్గపు ఆలోచన చేసింది. మంచి జరగాలంటే.. వనపర్తి శివారులోని జెర్రిపోతుల మైసమ్మ వద్ద అర్ధరాత్రి కోడి పుంజును బలివ్వాలని చెప్పింది. దాంతో బాలస్వామి ఈ ఏడాది జనవరి 21న అర్ధరాత్రి కోడిపుంజును తీసుకొని గుడి వద్దకు వెళ్లాడు, కానీ తిరిగిరాలేదు. మరుసటి రోజు ఉదయం లావణ్య కూడా కనిపించకపోవడంతో.. బాలస్వామి తమ్ముడు కొమ్మరాజుకు అనుమానమొచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నవీన్, లావణ్యలను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
గుడి దగ్గరకు వెళ్లిన బాలస్వామిని నవీన్, సుపారీ గ్యాంగ్ కురుమూర్తి, బంగారయ్య, గణేశ్‎లు కలిసి కారులో కిడ్నాప్ చేశారు. కొత్తకోట మీదుగా హైదరాబాద్‎కు తీసుకొచ్చి బాలాపూర్‎లో హత్య చేశారు. బాలస్వామిని హత్య చేసేందుకు నిందితులు నవీన్ తో రూ. 2 లక్షల సుపారీ మాట్లాడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.