*ఓ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!…

*ఓ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!*

మానవత్వం మంట కలిసింది. ఖాకీ నిర్లక్ష్యానికి మూడు నెలల చిన్నారి బలైంది.ఓ కన్న తల్లి కడుపు కోతకు కారణమైంది. వెయ్యి రూపాయల చలాన్ అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది.యాదగిరిగుట్ట పోలీసుల దాష్టీకం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.జనగామ జిల్లాకు చెందిన దంపతులకు చెందిన మూడు నెలల చిన్నారి పరిస్థితి విషమించడంతో.. ఓ ప్రైవేట్ కారులో హైద్రాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు కారును ఆపారు. కారుపై వెయ్యి రూపాయల చలాన్ ఉండడంతో.. పెండింగ్ చలాన్ కట్టాలని పోలీసులు హుకుం జారీచేశారు. ఎమర్జెన్సీ సమయంలో చేతిలో డబ్బులు లేకపోవడంతో పోలీసులను రిక్వెస్ట్ చేశారు. కాళ్ళు పట్టుకుని ప్రాధేయ పడ్డారు.కారులో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని వేడుకున్నారు.
అయినా వారి రోదనలు ఖాకీల చెవికెక్కలేదు. కాళ్ళా వెళ్ళా పడ్డాక ఆలస్యంగా కారును వదిలి పెట్టారు. అప్పటికే పరిస్థితి చేజారి పోయింది. ఆస్పత్రికి వెళ్లిన పది నిమిషాలకే మూడేళ్ల బాబు కానరాని లోకాలకు వెళ్లి పోయాడు. అరగంట ముందు తీసుకొస్తే బిడ్డ బతికి ఉండేవాడని వైద్యులు చెప్పారు. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయంటూ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బాద్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.