*ఖమ్మం జిల్లాలో ధారుణం*
-అంబులెన్స్ లేక బైక్ పై కూతురి శవం తరలింపు..
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన మానవ సమాజం తలదించుకునేలా చేసింది. తండ్రి ధీనగాధ కంటి కన్నీరు పెట్టిస్తుంది. అంబెలెన్స్ సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని 50 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లాడు ఓ తండ్రి.
అవును, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడో డెడ్ బాడీని బైక్‌పై తీసుకెళ్లారని, భుజాలపై మోసుకెళ్లారంటూ చూశాము. ఇప్పుడు అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్పత్రిలో ఫ్రీ అంబులెన్స్ లేక పోవడం.. ప్రైవేట్ అంబులెన్స్‌కి డబ్బులు ఇచ్చే స్థోమత లేక పోవడంతో.. కూతురు డెడ్‌బాడీని తండ్రి డైక్‌పై తీసుకెళ్లాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేక.. ప్రైవేట్ అంబులెన్స్ , ఆటోలకు డబ్బులు చెల్లించే స్తోమత లేక చనిపోయిన తన కూతురిని 50 కిలోమీటర్లు బైక్ పై తీసుకొచ్చాడు ఓతండ్రి. కూతురు మృతదేహాన్ని పొత్తిళ్లలో పెట్టుకొని దు:ఖాన్ని దిగమింగుకుంటూ బైక్ పై ప్రయాణించారు ఆబిడ్డ తల్లిదండ్రులు. వాగు దాటుకుంటూ చివరకు ఇంటికి చేరుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈవిషాద ఘటన మానవ సమాజాన్ని ఆలోచింపజేస్తుంది.
ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన వెట్టి సుక్కి అనే ఆదివాసి గిరిజన బాలిక రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉచిత అంబులెన్స్ కోసం సిబ్బందిని సంప్రదించాడు. అంబులెన్న్ సౌకర్యం లేదని చెప్పడంతో ప్రైవేట్ అంబులెన్స్, ఆటోలకు పెద్ద మొత్తంలో చెల్లించలేక చనిపోయిన కూతురి మృతదేహాన్ని బైక్ పైనే తీసుకొస్తున్నానని చెప్పాడు తండ్రి.
75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇంకా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధకరమంటున్నారు ప్రజలు. అభివృద్ధి దేవుడెరుగు.. ఇప్పటికి కొన్ని గిరిజన తండాలకు సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు ఆదివాసీలు.
*ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రతినిధులు గిప్ట్ స్మైల్ పేరుతో అంబెలెన్స్ లు ఇచ్చినామని చెప్పుకున్నా ప్రజలకు కష్ట కాలంలో ఉపయోగపడటం లేదు*